బీజేపీకి కోలుకోలేని షాక్: ముఖ్యనేత రాజీనామా

బీజేపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు బహిర్గతం అయింది. బీజేపీ అధిష్టానం రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అప్పటి నుండి పార్టీలో అంతర్గత వైరం నడుస్తోందని, పలువురు నేతలు పార్టీని వీడతారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. బీజేపీ పెద్దలు అందర్నీ కలుపుకుపోతూ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పార్టీ నేతలకు సూచిస్తూ వచ్చారు. అయినా నేతల మధ్య ఉన్న వర్గ పోరును మాత్రం అధిష్టానం అరికట్టలేకపోయింది అంటున్నాయి రాజకీయవర్గాలు. ఈ క్రమంలోనే కరీంనగర్ బీజేపీకి కోలుకోలేని షాక్ తగిలినట్టు తెలుస్తోంది.

కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొత్త శ్రీనివాసరెడ్డి…అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన తెలుపుతూ రాజీనామా లేఖలో పేర్కొన్నట్టు ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు హుస్నాబాద్ టికెట్ ఇస్తారని ఆశించినట్టు తెలిపారు. అయితే ఆ టికెట్ తనకి ఇవ్వకుండా మరొకరికి కేటాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం వెల్లడించారు.

           కొత్త శ్రీనివాసరెడ్డి

పార్టీనే నమ్ముకున్న తనకి బీజేపీ అధిష్టానం అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మూడు పేజీల నిడివితో కూడిన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు పంపినట్లు తెలిపారు. అయితే శ్రీనివాస్ తదుపరి కార్యాచరణ ఏమిటి? ఆయన వేరే పార్టీలో చేరనున్నారా అనే విషయాలు తెలియజేయలేదు. శ్రీనివాస్ రాజీనామా వ్యవహారం తెలుసుకున్న అధికార, ప్రతిపక్ష పార్టీ పెద్దలు ఇప్పటికే ఆయనతో మంతనాలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

కాగా శ్రీనివాస్ రెడ్డి రాజీనామా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి జెపి నడ్డా హైదరాబాద్ పర్యటనలో ఉండగా ముఖ్యనేత రాజీనామా పార్టీవర్గాల్లో కలకలం రేపింది. ఈ విషయం తెలంగాణ బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్టానం… అసంతృప్తిగా ఉన్న నేతలను బుజ్జగించి కలుపుకుపోవాలని, లేదంటే మరికొన్ని రాజీనామా పరంపరలు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకుల మాట.