TG BJP Chief: తెలంగాణ బిజేపీ కొంతకాలంగా జరుగుతున్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఎవరూ ఊహించని విధంగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావును ఎంపిక చేసింది. ఈమేరకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ వేయాలని అధిష్టానం పెద్దల నుంచి సమాచారం వచ్చింది. దీంతో అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ వేయనున్నారు. అనంతరం అధికారికంగా రాంచందర్ రావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు.
కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు తీవ్రంగా పోటీ పడ్డారు. తమకు తోచిన విధంగా పలు స్థాయిలో మంతనాలు జరిపారు. ఢిల్లీ వెళ్లి అక్కడ కూడా లాబీయింగ్ చేశారు. ముఖ్యంగా పార్టీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఈ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే అధిష్టానం మాత్రం అనూహ్యంగా రాంచందర్ రావు వైపు మొగ్గు చూపింది.
న్యాయవాది అయిన రాంచందర్ విద్యార్థి దశ నుంచి RSS భావజాలం కలిగి ఉన్నారు. RSSతో పాటు బీజేపీలోనూ పనిచేస్తూ వచ్చారు. దీంతో తొలి నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న రాంచందర్ పేరును ఆరెస్సెస్ పెద్దలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను కాకుండా పార్టీనే నమ్ముకున్న వారికీ ప్రాధాన్యత ఇవ్వడం బీజేపీ విధానం. ఈ క్రమంలోనే రాంచందర్ రావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. నూతన అధ్యక్షుడిగా రాంచందర్ రావు పేరు ఖరారు కావడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయను అభినందనలు చెబుతున్నారు.