Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు ముహుర్తం ఖరారు

Telangana BJP President: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. ప్లేట్ బీజేపీ చీఫ్ ఎన్నికకు జూన్ 28 (ఆదివారం) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ వెల్లడించారు. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తామని.. మంగళవారం జులై 1న అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం అదే రోజు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేది అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆశావహులు అలర్ట్ అయ్యారు.

అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు ఆశావహులు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేశారు. ముఖ్యంగా ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు రేసులో ఉన్నట్లు సమాచారం. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు కూడా వినపడుతోంది. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేశారు. తనదైన వాగ్దాటితో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ క్యాడర్ లో జోష్ నింపారు. అయితే ఆయనను అనూహ్యంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి కిషన్ రెడ్డినే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కీలక పదవిలో ఉన్నందున కిషన్ రెడ్డి స్థానంలో వేరే నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. మరి అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎవరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక అవుతారననే తీవ్ర ఉత్కంఠ కమలం నేతల్లో నెలకొంది. అయితే బీజేపీ సిద్ధాంతాల ప్రకారం అనూహ్యంగా కీలక నేతలను కాకుండా స్థానిక నేతలను ఎంపిక చేస్తారు ఏమో వేచి చూడాలి.