Rajasingh: బీజేపీకి రాజీనామా చేస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు రాజీనామా లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. ఇవాళ జరిగిన రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో తనను పోటీ చేయకుండా కొందరు నాయకులు అడ్డుకున్నారని లేఖలో పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలపై సంతకం చేయనివ్వలేదని తెలిపారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన తన అనుచరులను కూడా బెదిరించారని చెప్పుకొచ్చారు. తనను అవమానిస్తున్న ఈ పార్టీలో ఇకపై ఉండలేనని స్పష్టం చేశారు.
అంతకుముందు రాష్ట్ర అధ్యక్ష పదవికి రామచందర్ రావు ఎంపికైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. అధ్యక్ష పదవి ఎన్నికకు కార్యకర్తలు, నాయకులల నుంచి అభిప్రాయం తీసుకోవాలని తెలిపారు. ఒకరిద్దరు కూర్చుని అధ్యక్షుడిని ఎలా నిర్ణయిస్తారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
గత కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలో గ్రూపులు ఎక్కువయ్యాయని.. కష్టపడే నేతలకు విలువ ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలను రహస్యంగా కలుస్తూ చీకటి రాజకీయాలు చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి నాయకులకు స్వస్తి పలకాలని అధిష్టానం పెద్దలకు సూచించారు. కాగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలవడం విశేషం.|