రాయలసీమ కోసం ‘గుజరాత్ మోడల్’ – ప్రధానికి కందుల వినతి

(యనమల నాగిరెడ్డి)

“అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది” అన్న చందంగా అన్నీ వనరులు ఉన్నా వాటిని సక్రమంగా ఉపయోగించే నాయకుడు లేక పూర్తిగా వెనుకపడి, నిరంతరం కరువుతో సతమతమౌతున్న రాయలసీమ గోడు పట్టించుకోవాలని, గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఆ రాష్ట్రంలో ఉన్న కరువు ప్రాంతాలను అభివృద్ధి చేసిన విధంగా రాయలసీమను కూడా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కడప పార్లమెంటు నియోజకవర్గ భాద్యుడు కందుల రాజమోహన్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి విజ్ఞప్తి చేశారు.

శనివారం కడప కేంద్రంగా జరిగిన “మేరా బూత్ సబ్ సే మజబూత్” కార్యక్రమంలో కడప , కర్నూల్, తిరుపతి , నరసారావు పేట పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షా  సమావేశంలో కందుల రాజమోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో మోడీ తో నేరుగా మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప కేంద్రంగా ఉన్న కడప, కర్నూల్, అనంతపూర్, చిత్తూర్, నెల్లూరు జిల్లాలు రాష్ట్రంలో 45 శాతం ఉన్నాయని, అపార సహజవనరులు ఉన్నాయని అయితే పట్టించుకునే నాధుడు లేక అన్ని రకాల అన్యాయానికి గురైనాయని ఆయన ప్రధానికి వివరించారు. కందుల ఆరు నిముషాల పాటు ప్రధానితో మాట్లాడారు.

సహజ వనరుల ఖిల్లా రాయలసీమ

రాయలసీమ సహజవనరుల ఖిల్లా గా ఉందని ఆయన ప్రధానికి వివరించారు. “ప్రపంచంలో ఎక్కడా లేని ఎర్రచందనం,  ఆయిల్ వెలికితీయడానికి అవసరమైన బెరైటీస్ మంగంపేటలో విస్తారంగా ఉన్నాయని,సున్నపురాయి ,డోలమైట్, క్వార్ట్జ్ లాంటి ఖనిజ సంపద” ఏంతో  ఉందని, అయినా ఈ ప్రాంతం రాజకీయంగా నిర్లక్ష్యానికి గురై పూర్తిగా అన్యాయమై పోయిందని, అందువల్ల కరువు ఈ ప్రాంతంలో విలయతాండవం చేస్తూ ప్రజా జీవితాన్ని ఛిద్రం చేస్తున్నదని  ఆయన ఆవేదనతో వివరించారు. రాష్ట్ర నేతలు తమ రాజకీయ అవసరాల కోసం ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. “మీరు గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఆ రాష్ట్రంలో ఉన్న వెనుకపడిన ప్రాంతాలను అభివృద్ధి చేసిన విధంగా రాయలసీమను కూడా అభివృద్ధి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  ప్రధానిగా మీరు స్వయంగా చొరవ తీసుకుని ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన కోరారు.

కడపను త్యాగమూర్తిగా గుర్తించండి

దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే యురేనియం ఉత్పత్తి చేసే ప్రాంతాలకు అనేక రకాల కష్టనష్టాలుంటాయని, అందువల్ల వాటిని “త్యాగమూర్తులైన ప్రత్యేక ప్రాంతాలుగా గుర్తించి ఆదుకోవాలని” 1972 లోనే అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ సూచించారని ఆయన ప్రధానికి గుర్తు చేస్తూ “ యురేనియం నిల్వలు అధికంగా ఉన్న కడప జిల్లాను త్యాగమూర్తి జిల్లాగా గుర్తించి అదుకోడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

యురేనియం కార్పొరేషన్ అఫ్ ఇండియా నేతృత్వంలో గత 5 సంవత్సరాలుగా జిల్లాలోయురేనియం వెలికి తీయడం, శుద్ధి చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని,  అందువల్ల పులివెందుల ప్రాంతంలోని ప్రజలు ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, పంటలు దెబ్బ తిన్నాయని, రైతుల ఆరోగ్యం దెబ్బతినిందని  రాజమోహన్ రెడ్డి ప్రధాని దృష్టికి తెచ్చారు. అందువల్ల రైతులను ఆదుకోడానికి, ఈ జిల్లాను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించడానికి చర్యలు తీసుకోవాలని రాజమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సొమ్ము ఒకరిది– సోకొకరిది

కేంద్రప్రభత్వం ప్రవేశపెట్టిన అనేక పధకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా పేర్కొంటున్నదని  ఆయన ఫిర్యాదు చేశారు. ఆయా పధకాల పేర్లు కూడా మార్చారని అయన ఆరోపించారు. అయితే బీజేపీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేసినపుడు ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఫథకాల గురించి తమకు తెలుసునని, కేంద్రం సొమ్ము తో రాష్ట్రం సోకు చేసుకుంటున్నట్లు  చెప్పారని ఆయన ప్రధానికి తెలిపారు.

కడప ఉక్కు

కడప లో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని రాయలసీమ వాసులతో పాటు తానూ గత నాలుగు సంవత్సరాలుగా కోరుతున్నానని, కేంద్రం ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీకి శంఖుస్థాపన చేసి, ఈ ఉక్కు పరిశ్రమను ప్రయివేటు రంగంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని ఆయన తెలిపారు. ఈ  నిధులు ఆ ప్రయివేటు వ్యక్తులు పెడతారా? లేక రాష్ట్రంలో ఇంతవరకు సమీకరించిన “అవినీతి సొమ్మును” దొడ్డిదారిన తెస్తారా? అనేది తెలియడం లేదని ఆయన వ్యంగంగా అన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం వెంటనే ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాజమోహన్ రెడ్డి కోరారు.

ప్రధాని పై పొగడ్తల వర్షం

మోడీ లాంటి ప్రధాని  దొరకడం భారత దేశం చేసుకున్న అదృష్టంగా మెక్సికో అధ్యక్షుడు, సౌదీ రాజకుటుంబీకులు, మలేసియా రాజకుటుంబీకులు  తన విదేశీ పర్యటనల సందర్భంగా చెప్పారని ప్రధానికి తెలిపారు. కేంద్ర అమలుచేస్తున్న పధకాలన్నింటినీ ప్రజలకు చేర్చడంలో ప్రభుత్వం విజయం సాధించిందని, ఇది ఇలాగే సాగి దేశంలో పేదరికం పోవాలని కందుల ఆకాంక్షించారు.  “మీ నేతృత్వంలో మేము కస్టపడి పని చేసి పార్టీకి జీవం పోస్తామని, పార్టీ గెలుపుకు కృషి చేస్తామని”రాజమోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రవీంద్ర రాజు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, సుమారు 1500 మంది కార్యకర్తలు పాల్గొన్నారని రాజమోహన్ రెడ్డి తెలుగురాజ్యం ప్రతినిధికి తెలిపారు.