ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలపై దృష్టి సారించాయి. “సిద్ధం” అని వైఎస్ జగన్ కేడర్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంటే… “రా.. కదలిరా” అంటూ చంద్రబాబు.. “శంఖారావం” అంటూ చినబాబు లోకేష్ లు జనాల్లో తిరుగుతున్నారు. ఇదే సమయంలో గతంలో “వారాహి యాత్ర”తో హల్ చల్ చేసిన పవన్ కల్యాణ్… మరోసారి భారీ ప్లాన్ తో ప్రచార బరిలోకి దిగబోతున్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పెద్ద టార్గెట్టే పెట్టుకున్నారని అంటున్నారు.
అవును… సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ “సిద్ధం” అంటూ వైఎస్ జగన్ మూడు రీజియన్ లలోనూ భారీ సభలు నిర్వహించారు. భీమిలి, దెందులూరు, తాజాగా రాప్తాడులో బహిరంగ సభలు.. కాదు కాదు.. భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభలకు కెరటాలు, కెరటాలుగా జనం తరలివచ్చారు. దీంతో… ఈ సభలు వైసీపీ నేతల్లోనూ, కేడర్ లోనూ సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయనడంలో సందేహం లేదు.
మరోపక్క “రా.. కదలిరా” అంటూ చంద్రబాబు ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో తన ప్రసంగాల్లో మరింత డోస్ పెంచి.. మాస్ డైలాగులు కూడా వదులుతున్నారు. అవి కాస్తా… నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇదే సమయంలో “శంఖారావం” అంటూ చినబాబు సభలు కండక్ట్ చేస్తున్నారు. వేదికపై కుర్చీలు మడతపెడుతూ… కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో అటు చంద్రబాబు, ఇటు లోకేష్ లు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలను కవర్ చేస్తుండగా… పవన్ కల్యాణ్ సభలు రాయలసీమ నుంచి ప్రారంభమవుతాయని తెలుస్తుంది. వాస్తవానికి 175 నియోజకవర్గాల్లోనూ పవన్ సభలు ఉంటాయని చెబుతున్నప్పటికీ.. ప్రధానంగా రాయలసీమపైనే పవన్ దృష్టి అని.. అక్కడ నుంచే ఆయన ఎన్నికల ప్రచార సభలు స్టార్ట్ అవుతాయని అంటున్నారు.
ఇలా పవన్ రాయలసీమపై ప్రధానంగా దృష్టి పెట్టడం వెనుక కూటమి వ్యూహం పెద్దగానే ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా.. వైసీపీ బలంగా ఉన్న రాయలసీమలో ప్రధానంగా కోటలను బద్ధలు కొట్టాలని చూస్తున్నట్లుగా ఉందని తెలుస్తుంది. రాయలసీమలో గత ఎన్నికల్లో వైసీపీ 52 అసెంబ్లీ సీట్లకు గానూ 49 సీట్లను గెలుచుకుంది. దీంతో అక్కడ ఆ సంఖ్యను వీలైనంత మేర తగ్గించాలనేది ప్రధానంగా పవన్ ముందున్న లక్ష్యం అని అంటున్నారు.
అలా రాయలసీమలో వైసీపీ సీట్లను తగ్గించ గలిగితే… కోస్తా జిల్లాల్లోని తమ బలానికి అది తోడవుతుందని.. అపుడు అధికార పీఠాన్ని సులువుగా అందుకోవచ్చు అని బాబు & కో భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే సీమ టార్గెట్ గా పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు అని అంటున్నారు. రాయలసీమలో అధికంగా ఉన్న బలిజలను కూటమి వైపు తీసుకుని వస్తే… వైసీపీ వీక్ అవుతుందని వ్యూహరచన చేస్తున్నారు. మరి ఈ భారీ లక్ష్యాన్ని పవన్ ఏ మేరకు రీచ్ అవుతారనేది వేచి చూడాలి!