చంద్రబాబు మాస్టర్ ప్లాన్..మోడిని ఉచ్చులోకి లాగుతున్నారా?

గడచిన మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వాటి విషయంలో తెలుగుదేశంపార్టీ స్పందిస్తున్న తీరు చూస్తుంటే చంద్రబాబునాయుడు మాస్టర్ ప్లాన్ ఏదో వేసినట్లే అనుమానంగా ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ ఏదో వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓట్లు కురిపేంచేవిగా ఉంటుందనటంలో సందేహం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే, పలువురు వ్యాపారస్తులతో పాటు నిర్మాణరంగం సంస్దలపై మూడు రోజులుగా ఐటి దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులపైనే చంద్రబాబు, మంత్రులు, నేతలు స్పందనే విచిత్రంగా ఉంది.

ఐటి దాడులపై క్యాబినెట్ సమావేశంలో  చాలా వాడి వేడిగా చర్చించారు. ఐటి దాడులను క్యాబినెట్ సమావేశం తప్పుపట్టింది. ఐటి దాడుల వల్ల పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారట. ఐటి దాడులు జరగటమంటే, రాష్ట్రంపైన, ప్రజాస్వామ్యంపైనే దాడిగా క్యాబినెట్ తీర్మానించటం విచిత్రంగా ఉంది. సరే, ఇలాంటి పిచ్చి తీర్మానాలు చాలానే చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఐటి దాడులను అడ్డం పెట్టుకుని కేంద్రంపై ప్రత్యక్ష పోరాటానికి టిడిపి సిద్ధమవుతోంది. కేంద్రంపై యుద్ధమంటే, కేంద్ర చట్టాలను ఏపిలో అమలు చేయమంటే ఏం జరుగుతుందో, దాని పర్యవసానాలు ఎలాగుంటాయో తెలీనంత అమాయకుడు కాదు చంద్రబాబు. మరి తెలిసీ ఎందుకు కేంద్రంపై కాలు దువ్వుతున్నారు ? ఎందుకంటే, కావాలనే కేంద్రాన్ని రెచ్చగొడుతున్నట్లు అనుమానంగా ఉంది.

కేంద్రాన్ని రెచ్చగొట్టటం వల్ల, ఏపికి వ్యతిరేకంగా కేంద్రం ఏమన్నా చర్యలు తీసుకుంటే దాన్ని వచ్చే ఎన్నికల్లో అవకాశంగా తీసుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది. కేంద్రం చర్యలను సానుభూతిగా మార్చుకుని వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టాలన్నదే చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు గ్రాఫ్ నేలబారుకి దిగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. జాతీయ సర్వేలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్ధితుల్లో మామూలుగా అయితే టిడిపి రెండోసారి అధికారంలోకి రావటం జరిగేపనికాదు. అందుకనే కేంద్రాన్ని రెచ్చగొట్టి ఉచ్చులోకి లాగి ఎన్నికల్లో తన లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తున్నట్లుంది.