ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ చంద్రబాబునాయుడు కొత్త బిస్కెట్లు వేయటం మొదలుపెట్టారు. మొన్ననే వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు రూ 2 వేలు ఇస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు తొందరలో రైతులకు కూడా కొత్త పథకాలంటూ రైతులను ఆకట్టుకునేందుకు ప్లాన్ వేస్తున్నారు. వ్యవసాయం కోసం రైతులకు పెట్టుబడి సాయం చేస్తారట, కౌలు రైతులకు లోన్లు ఇస్తారట. ఇంతకాలం రుణమాఫీ అంటూ రైతులకు పచ్చటోపీ పెట్టిన చంద్రబాబు తాజాగా పెట్టుబడి సాయమని, కౌలు రైతులకు కూడా అప్పులు ఇప్పిస్తామనే కొత్త నాటకానికి తెరలేపుతున్నారు.
కొత్త పథకం ముహూర్తానికి చంద్రబాబు వచ్చే ఖరీఫ్ సీజన్ నే నిర్ణయించారు. అందుకు 21వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో అధికారిక ముద్ర వేయించుకోబోతున్నారు. సరే, చంద్రబాబు చెప్పిన తర్వాత కాదనే మంత్రెవరున్నారు లేండి. పోయిన ఎన్నికల్లో రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. అప్పట్లో మాఫీ చేయాల్సిన రుణాలు సుమారు లక్ష కోట్ల రూపాయలుగా టిడిపి నేతలు అంచనాలు కట్టారు. ఏదో అదృష్టం కొద్దీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ లెక్కలన్నీ మారిపోయాయి. ఎన్నికలకు ముందున్న లక్ష కోట్ల రైతు రుణాలు అధికారంలోకి రాగానే రూ 28 వేల కోట్లకు పడిపోయాయి.
పోనీ అదన్నా చేశాడా అంటే అదీ లేదు. ఒకవైపు రైతు రుణమాఫీ జరిగిపోయిందని, చేసేశామని చెబుతూనే రుణామీఫీ చేయాల్సిన రూ 9 వేల కోట్లకు అప్పుల కోసమంటూ ప్రైవేటు ఆర్దిక సంస్ధలతో మాట్లాడుతున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా వెంటనే రుణమాఫీ పేరుతో డ్రామాలు మొదలుపెట్టారు. అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగానే రుణమాఫీలంతా చేసేశామని చెప్పుకునేందుకు తాపత్రయపడుతున్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ కాకుండానే కొత్తగా కౌలు రైతులకు కూడా రుణాలని, పెట్టుబడి సాయమని కొత్త కథలు చెబుతున్నారు. చంద్రబాబు కొత్తగా చెబుతున్న కథలను రైతులు నమ్ముతారా ?