ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గ్రాఫిక్కులంటే చాలా ఇష్టం. తాను సృష్టించిన గ్రాఫిక్కుల మాయాజాలంలో జనాన్ని ఉంచేయడం అంటే మహా ఇష్టం. అలా గ్రాఫిక్కులను చూపిస్తూ ఈ అయిదేళ్లూ కాలక్షేపం చేశారు చంద్రబాబు. ఎన్నికల దగ్గర పడ్డాయి. పైగా అది స్వామి కార్యం.
అయినా ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక్కడా తనదైన మార్క్‌లో గ్రాఫిక్కుల మాయాజాలాన్ని సృష్టించి జనం మీదికి వదిలారు. 150 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనా వ్యయంతో అమరావతి ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించబోతున్న శ్రీవారి ఆలయానికి సంబంధించిన గ్రాఫిక్ అది. ఈ ఆలయ నిర్మాణానికి చంద్రబాబు గురువారం ఉదయం అంకురార్పణ చేయబోతున్నారు.
శ్రీవారి మూలవిరాట్టును ప్రతిష్ఠించే ప్రదేశంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని పనులనూ టీటీడీ పూర్తి చేసింది. ఆలయ నమూనా, రూపు రేఖలు ఎలా ఉంటాయనే విషయాన్ని వివరిస్తూ రెండు నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను రూపొందించారు.