వేలం వేస్తానన్న విజయ్ దేవరకొండ ఫిలిం ఫేర్ అవార్డు విలువ ఎంతో తెలుసా?

‘పెళ్లి చూపులు’ లాంటి చిన్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఊహించని విజయాన్ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వివాదాల నడుమ విడుదల అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టాడు. విడుదల అయ్యాక కూడా ఈ సినిమా పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ యువతను బాగా ఆకట్టుకొంది. విజయ్ కి ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో తన నటనకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అయితే ఆ అవార్డు అందుకున్న వెంటనే దానిని సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాలి అనుకుంటున్నా అని విజయ్ ప్రకటించాడు. వేలం వేసి వచ్చిన డబ్బును నేరుగా ప్రభుత్వానికి అందజేస్తా అని చెప్పాడు.

ఇప్పుడు ఆ అవార్డును వేలం వేయకుండానే దాన్ని సొంతం చేసుకుంది ‘దివిస్ లాబొరేటరీస్’. 25 లక్షల రూపాయల విలువ కట్టి దాన్ని కొనుక్కుంది. ఆదివారం జరిగిన రౌడీస్ బ్రాండ్ లాంచింగ్ సందర్భంగా దివిస్ లాబొరేటరీస్ అధినేత కిరణ్ దివి భార్య శకుంతల దివి దానిని అందుకున్నారు. 25 లక్షల రూపాయల చెక్ విజయ్ దేవరకొండ చేతికి అందివ్వబోగా అతను సున్నితంగా తిరస్కరించాడు.