అందరికీ దూరమే ఈ పందిపిల్ల!( ‘అదిగో’ రివ్యూ)

–సికిందర్ 

Rating:1/5

లో – బడ్జెట్ లో వెరైటీ సినిమాలు తీసే దర్శకుడు, నటుడు రవిబాబు చాలా కాలంగా పంది పిల్లతో వార్తల్లో వున్నారు. నోట్ల రద్దు సమయంలో కూడా పంది పిల్లని ఎత్తుకుని ఏటీఎం ముందు క్యూలో నిలబడ్డారు. ఆ పంది పిల్లతో కొత్త నోట్లు కలెక్షన్స్ గా రాబట్టే ప్రయత్నంలో పర్ఫెక్షన్ కోసం పాట్లు పడుతూనే వున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా పంది పిల్లతో పాద యాత్ర కూడా నిర్వహించారు. వెరైటీ ఆలోచనలు చేసే రవిబాబు సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో తన పందిపిల్ల మూవీకి ‘అదుగో’ అని టైటిల్ పెట్టి ఈ వారం విడుదల చేశారు. అయితే లో- బడ్జెట్ దర్శకుడుగా పేరున్న రవిబాబుకి ఈసారి లో –బడ్జెట్ పప్పులుడకలేదు. పంది పిల్ల పన్నెండు కోట్లు తినేసింది. అయినా ఏం ఫర్వాలేదని ఇతర భాషల్లో ‘బంటీ’ గా కూడా విడుదల చేస్తున్నారు. ఇంత పబ్లిసిటీ పొందుతున్న పందిపిల్ల ఈ త్రీడీ యానిమేషన్లో ఏం చేసిందో చూద్దాం…

 

కథ
గన్నవరంలో తల్లిపంది పిల్ల పందికి చెప్పే కథ ఇది. అమరావతిలో దుర్గా అనే ల్యాండ్ మాఫియా రైతుల దగ్గర భూములు లాక్కున్న వివరాలున్న మైక్రో చిప్ పోగొట్టుకుంటాడు. గన్నవరంలో చంటి అనే కుర్రాడు పెంచుకుంటున్న బంటీ అనే పంది పిల్ల ఓ ముఠా కారు కడ్డమొస్తే తీసి కెళ్ళి పోతారు. అది తప్పించుకునే ప్రయత్నంలో మైక్రో చిప్ ని మింగేస్తుంది. బంటిని వెతుక్కుంటూ చంటి హైదరాబాద్ చేరుకుంటాడు. హైదరాబాద్ లో సిక్స్ ప్యాక్ శక్తి (రవిబాబు) అనే గ్యాంగ్ లీడర్ కి ల్యాండ్ మాఫియా దుర్గాతో తేడాలుంటాయి. అతనూ ఆ మైక్రో చిప్ కోసం వెంట బడతాడు. హైదరాబాద్ లోనే యానిమల్ రేసులు నిర్వహించే ముఠా వుంటుంది. అక్కడ పందిపిల్లల రేసులు ప్రకటిస్తే ఓ జ్యోతిష్కుడు మూడు నల్ల మచ్చలున్న తెల్ల పందిపిల్ల రేసు గెలుస్తుందని గుట్కా గంగరాజు అనే ముఠాకోరుకి చెప్పడంతో అతను బంటిని చూసి దాని వెంటపడతాడు. షార్జా శంకర్ అనే ఇంకో ముఠాకోరు కూడా అదే బంటీ కోసం వేట మొదలెడతాడు. ఒక ప్రేమ వ్యవహారంలో వున్న అభిషేక్ (అభిషేక్ వర్మ), రాజీ (నభా పటేల్) లకి కూడా బంటీ అత్యవసరమవుతుంది. ఇలా ఇన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన ప్రమాదాల్లోంచి బంటి ఎలా బయటపడి చంటి దగ్గరికి చేరిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

కంప్యూటర్ గ్రాఫిక్స్ వచ్చాక సినిమా కథల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. అసాధ్యమనుకునే కథలు కూడా వెండితెర కెక్కుతున్నాయి. పంది పిల్ల కథని సినిమా తీయడం సీజీ వల్లనే సాధ్యమైంది. ఇండియాలో మొదటి లైవ్ యాక్షన్ పూర్తి స్థాయి త్రీడీ సూపర్ స్టార్ గా పంది పిల్లని పేర్కొంటూ ఈ కథ చేశారు. సాంకేతికంగా త్రీడీ రిఫరెన్స్ కోసం పంది పిల్లని వాడుకున్నారు. ముందుగా 2 – డీలో చేద్దామనుకుని ప్రయత్నించి పూర్తిగా విఫలమైన తర్వాతే త్రీడీ కెళ్ళారు. దీనికి పర్ఫెక్షన్ కోసం అనేక వీఎఫ్ఎక్స్ సంస్థల్ని మారుస్తూపోయారు. ఇందుకే నిర్మాణంలో చాలా సమయం తీసుకుంది.

ఇది పూర్తి స్థాయి యాక్షన్ కామెడీ కథ. పంది పిల్ల చుట్టూ కొన్ని కథలుండే కథ. జంతువుల సినిమాలంటేనే పిల్లల సినిమాలు, కుటుంబ సినిమాలు కూడా. అందులోనూ ఎవరైనా చిరాకుపడే పందిపిల్లతో సినిమా అంటే రిస్కీ వ్యవహారం. అయినా సినిమాగా ఎంటర్ టైన్ చేయడానికి సాహసించినప్పుడు నల్గురూ అసహ్యించుకునే జీవిని పిల్లలు సైతం ఇష్టపడేలా సంస్కరించి చూపించాలి. అప్పుడే ఇలాటి ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయి. ఇలా కాకుండా కామెడీ పేరుతో అసహ్యాన్నీ, జుగుప్సనీ, హింసనీ పందిపిల్ల చుట్టూ చూపిస్తే అసలుకే మోసం వస్తుంది.

 

ఎవరెలా చేశారు

బంటీ అనే పందిపిల్ల ప్రధాన పాత్ర. దీన్ని సజీవ పాత్రగా నిలబెట్టే ప్రయత్నం మాత్రం చేయలేకపోయారు. చంటి అనే కుర్రాడితో దీని అనుబంధం గురించి వేసిన సీన్లు ఉత్తుత్తివే అన్పిస్తాయి. ప్రమాదంలో ఇరుక్కున్నపుడు చంటిని చూసి అది కన్నీరు కార్చే రెండు సీన్లు వేసి సెంటిమెంట్లు వర్కౌట్ అయ్యిందనుకున్నారు. కానీ లెక్కలేనన్ని దుష్ట పాత్రల హింసాత్మక ఉరుకులు పరుగుల పోరాటాల మధ్య బంటి పాత్ర చిత్రణ పూర్తిగా బలి అపోయింది. దాని ఇష్టాయిష్టాలతో దానికంటూ ఓ కథలేదు. జంతువులకి కూడా మనుషులకి లాగే ఆత్మాభిమానం, అవమాన భారం, బ్రతికే హక్కూ వుంటాయన్నకోణాన్ని అస్సలు టచ్ చేయలేదు. మనం అసహ్యించుకునే పంది మనకంటే బెటర్ అన్న సంఘటన ఒక్కటీ సృష్టించలేదు.

దీని యానిమేషన్ కి ఇన్నికోట్లు ధారబోసినప్పుడు పాత్రపరంగా రక్త మాంసాల్ని అద్దలేదు. హాలీవుడ్ లో తీసే జంతు సినిమాలు అర్ధవంతంగా కనిపిస్తాయి. పిల్లితో ‘ఏ స్ట్రీట్ క్యాట్ నేమ్డ్ బాబ్’ (2016), పందితో ‘బేబ్ : పిగ్ ఇన్ ది సిటీ’ (1998) లాంటి జంతు సినిమాలు వాటి పాత్రచిత్రణలతో ఆబాలగోపాలాన్ని అలరించేట్టు వుంటాయి. కొన్ని గుర్తుండి పోతాయి. బంటి వినోదం కోసం దుండగుల్ని అది ముప్పుతిప్పలు పెట్టే సీన్లు వేశారు. కానీ ఇవీ పిల్లల్ని ఆకట్టుకోవడానికి – రొటీన్ తెలుగు సినిమాల వికృత ముఠాల మాఫియా కథలే అడ్డుపడ్డాయి.

రవిబాబు సహా గ్యాంగ్స్ గా నటించిన నటులందరూ ఓవరాక్షన్, హింస, జుగుప్సాకర కామెడీలతో రసాభాస చేశారు. ఈ గందరగోళంలో హీరోహీరోయిన్ల ప్రేమ కథ కూడా తలకెక్కదు. కెమెరా వర్క్, సంగీతం, ఎడిటింగ్ మాత్రం బావున్నాయి. రవిబాబు దర్శకత్వం హార్ష్ గా వుంది.

చివరికేమిటి 
        ఈ యానిమల్ మూవీని ఏ మార్కెట్ యాస్పెక్ట్ తో ఏ జానర్ కింద తీశారో అర్ధంగాదు. మాస్ కోసమా? అందరూ చూస్తారనా? అందరూ చూసేట్టు వుండాలనుకుంటే ఇన్ని కథలు, ఇన్ని చిల్లర పాత్రలుండవు. వినోదం పేరుతో టాయిలెట్ కామెడీలుండవు. వాంతులూ విరేచనాలతో, పదేపదే పక్క పాత్రల మీద ఉమ్మివేయడాలతో వికార చేష్టలుండవు. ఒక  ‘బేబీస్ డే ఔట్’ (సిసింద్రీ) లాగా, ఒక ‘హోం ఎలోన్’ లాగా, కొన్నే పాత్రలతో, ఒకే సూటి కథతో, జంటిల్ మాన్ విలన్లతో, తెగ హాస్యాన్నిపండిస్తూ హ్యూమరస్ గా వుంటాయి. ఇదంతా మిస్ చేసి మూస మాస్ చేశారు. యానిమల్ మూవీ జానర్ మర్యాదల్నే నిర్లక్ష్యం చేశారు. మాస్ చూడాలంటే కష్టం, క్లాస్ చూడాలంటే ఇంకా కష్టమన్నట్టు ‘అదుగో’ అన్నారు. అదుగో అని హాలీవుడ్ యానిమల్స్ వైపు చూడండంటూ వేలు అటు చూపించారు, అంతే.

తారాగణం: అభిషేక్ వర్మ, నాభ నటేష్, రవి బాబు, టి. ఉద్య భాస్కర్, ఆర్ కె. వీరేందర్ చౌదరి తదితరులు
స్క్రీన్ ప్లే: సత్యానంద్,  
డైలాగ్స్: రవి బాబు, నివాస్,
లిరిక్స్: భాస్కర్ భట్ల,
మేకప్: దొడ్డి శ్రీనివాస్,
కొరియోగ్రాఫర్: ప్రసన్నా,
యాక్షన్: కనల్ కన్నన్, విజయ్, సతీష్,
ఆర్ట్: నారాయణ రెడ్డి,
ఎడిటర్: పల్లా సత్యనారాయణ,
కెమెరా: సుధాకర్ రెడ్డి,
మ్యూజిక్: ప్రశాంత్ విహారి,
కథ-నిర్మాత-దర్శకత్వం: రవి బాబు
సమర్పణ : సురేష్ ప్రొడక్షన్స్
నిర్మాణం : ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ఎంటర్ టైన్మెంట్
విడుదల : నవంబర్ 7, 2018