ఏదైనా మనం అనుకున్నది జరిగితే ఆ ఆనందమే వేరు. ఇప్పుడు అదే మూడ్ లో ఉన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. ఆయన ఆనందానికి కారణం రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘బాహుబలి’ చిత్రం సందడి చేయటానికి షెడ్యూల్ ఖరారు అవటమే. లండన్‌లో ఎంతో ఫేమస్ అయిన కాన్సర్ట్ హాలు ఇది .
ఈ హాలులో వచ్చే ఏడాది ‘బాహుబలి: ది బిగినింగ్’ సౌండ్ ట్రాక్‌ను వినిపించబోతున్నారు. దీంతోపాటు ‘హ్యారీ పోటర్ అండ్ ది గాబ్లెట్ ఆఫ్ ఫైర్’, ‘స్కైఫాల్’ చిత్రాల సౌండ్ ట్రాక్‌ను కూడా ప్రదర్శించబోతున్నారు. ఈ విషయమై … శుక్రవారం నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని ‘రాయల్ ఆల్బర్ట్ హాల్’ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకున్నారు.
‘గత ఏడాది రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్‌కు వెళ్లాం. అప్పుడు ‘బాహుబలి’ సౌండ్ ట్రాక్‌ను ఇక్కడ ప్లే చేస్తే ఎంత గొప్పగా ఉంటుందని చర్చించుకున్నాం.. ఎవరో ‘తధాస్తు’ అన్నట్లు ఉన్నారు.. ఈ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నా..’ అని పేర్కొన్నారు.