ఒక నాటి హస్యనటుడు బాబు మోహన్ రాజకీయాల్లో నవ్వుల పాలు కాదల్చుకోలేదు. ఆయనిపుడు సీరియస్ గా భవిష్యత్తుగురించి ఆలోచిస్తున్నారు. ఈ ఏడాది ఆయన రాజకీయ జీవితంలో ద్విదశాబ్ది పండగ జరపుకోవాలి. ఎందుకంటే, ఆయన 1998లో ఆందోల్‌కు జరిగిన ఉప ఎన్నికలలో పోటీ చేయడంతో రాజకీయాల్లోకి వచ్చారు.
ఆ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. తర్వాత1999లో, 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపొందారు. టిడిపితో రాజకీయాలు ప్రారంభమయినా ఆయన తర్వత ప్రత్యేక రాష్ట్ర రాజకీయాల కారణంగా టిఆర్ ఎస్ లోకి వచ్చారు. టిడిపిలోనే ఒక సారి మంత్రి అయ్యారు. అంటే ఆందోల్ నియోజకవర్గ ప్రజలతో ఆయనకు రెండు దశాబ్దాల బంధం ఉంది. ఇక్కడొక ముఖ్యమయిన విషయం ఉంది. 1998లో టిడిడి తరఫున పోటీ చేస్తున్నపుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ఇన్ చార్జ్ గా ఉన్నదెవరో తెలుసా? అప్పటి రవాణా మంత్రి కె చంద్రశేఖర్ రావు. తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సహకరించిన నాయకుడే ఇపుడు తనను అర్ధాంతరంగా ఇలా పక్కన పడేయడం బాబూమోహన్ జీర్ణించుకోలేక పోతున్నారు.
ఈ సారి ఎన్నికల్లో అధిష్టానం పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఈ రెండుదశబ్దాల రాజకీయానికి ఫుల్ స్టాఫ్ పెట్టాల? అనే ప్రశ్నతో సతమతమవుతున్నారు. కెసిఆర్ చర్యతో ఆయన హర్ట్ అయ్యాడని సన్నిహితులు చెబుతున్నారు. తను దళితడు కాబట్టే ఈజీగా పక్కన పెట్టారని, కెసిఆర్ తీసేసిన వారిలో ఒక అగ్రకులం వాడయినా ఉన్నారా అని ఆయన బాధ పడుతున్నారట. అందుకే భవిష్యత్తు గురించి యోచిస్తున్నారు. తర్వాత ముఖ్యమంత్రి తో మాట్లాడే ప్రయత్నం కూడ చేయలేదు. కలవాలనుకుంటే అప్పాయంట్ మెంట్ కూడా రాదు. అదొక అవమానం అవుతుంది. అందుకే ఆయన ఒక కీలకనిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసింది.
ఆందోళ్ నుంచి పోటీ చేయాలంటే ఆయన ముందున్న ఒకే ఒక ఆప్షన్ బిజెపిలో చేరడం. ఇక ఏ పార్టీలోచేరినా తనకాసీటు రాదు. ఎందుకంటే ఆక్కడ మాజీ ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కాంగ్రెస్ అభ్యర్థఇకావడం, మిగతా పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడే అవకాశం ఉండటంతో ఆ సీటునుకాంగ్రెస్ కే వదిలేస్తాయి. ఈ వి షయం గురించి ఆయన తన పన్నిహితులతో మాట్లాడుతున్నారు. భవిష్యత్తు గురించి వారితో చర్చిస్తున్నారు. దీనికోసం ఆయన వోదెలు లాగా స్వీయ నిర్బంధం విధించుకోకండా జనంలోకి వెళ్లుతున్నారు. నిన్న పుల్కల్ మండలంలోని గొంగ్లూర్‌లో ఒక గిరిజన రైతు విద్యుత్ షాక్‌తో మరణించాడు. వెంటనే స్పందించారు. గ్రామానికి చేరుకొని గిరిజన కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ ఆయనకు చాలా సానుభూతి లభించింది.
ఆయన టికెట్ రాకపోవడంతో పార్టీలోని సన్నిహితులు బాగా షాక్ కు గురయ్యారు. మౌనంగా ఉండటం మంచిది కాదని, టికెట్ రాలేదని రాజకీయాలనుంచి రిటైర్ కావడం సరైంది కాదని వారు చెబుతున్నారు. రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండేందుకు, అతన్నినమ్ముకున్న వారికోసం ఏదో ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆయన ఆలస్యం చేస్తే మేమే పార్టీ నుంచి వెళ్లి పోయేందు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారని చెబుతున్నారు.
దారి ఎటూ…
బాబు మోహన్ ఇపుడు దారి ఎటూ అనే సందిగ్ధంలో ఉన్నారు. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆయన సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులతో చర్చలు జరుగుతున్నాయని, ఆందోళ్ నుంచి పోటీచేయించేందుకు బిజెపి రెడీ ఉందని కూడా చెబుతున్నారు. బిజెపి నుంచి పోటీ చేస్తే విజయవాకాశాలెలా ఉంటాయని ఆయన యోచిస్తున్నారట.