రాష్ట్రాలకు కేంద్రమే వ్యాక్సిన్లను కేటాయిస్తోంది. ఏయే గ్రూపులకు తొలుత వ్యాక్సినేషన్ చేయాలనేది కేంద్రమే నిర్ణయిస్తోంది. ఆ లెక్కన వ్యాక్సినేషన్ అనేది పూర్తిగా కేంద్రం కనుసన్నల్లోనే నడుస్తున్న ప్రక్రియగా భావించాలి. అయితే, ఆయా రాష్ట్రాలు రికార్డుల కోసం కేంద్రం కేటాయించిన వ్యాక్సిన్లను తమ ఇష్టమొచ్చినట్లుగా ఆయా గ్రూపులకు ఇచ్చే ప్రక్రియ చేపట్టాయి. దాంతో, మొదటి డోసు పొందినవారికి రెండో డోస్ పొందడం గగనమైపోతోందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇందులో నిజం లేకపోలేదు. ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాలనే తీసుకుంటే, మొదటి డోస్ వ్యాక్సిన్ కొద్ది రోజులపాటు ఆపేసి, పూర్తిగా రెండో డోస్ వ్యాక్సినేషన్ మాత్రమే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్రం గనుక, అవసరమైన మేర టీకాలు అందించగలిగితే, నెలకు కోటి వ్యాక్సిన్లు వేసే సామర్థ్యం రాష్ట్రానికి వుందని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం చెబుతోంది. అసలు దేశంలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్లు ఎన్ని.? అన్న ప్రశ్న చుట్టూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సరైన ఆలోచన చేయకుండానే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా.? అన్న అనుమానం కలగకమానదు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ గొప్పలు చెప్పుకుంటూ వుంటే, కేంద్రం పరిస్థితేంటి. అసలు సమస్య కేంద్రంతోనే వచ్చింది. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం తెరపైకి తెచ్చిన విధానం డొల్లతనంతో కూడుకున్నదై వుండడం వల్లే ఇప్పుడీ పరిస్థితి అన్నది రాజకీయ పరిశీలకుల వాదన. వైద్య నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వివిధ దేశాల నుంచి వ్యాక్సిన్ రప్పించడంపై ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాల్సి వచ్చిందంటే.. దేశంలో వ్యాక్సిన్ లభ్యత ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చ. ఈ బాధ్యతారాహిత్యం కేవలం కేంద్రానిదో, రాష్ట్రానిదో కాదు.. రెండిటిదీ…!