జగన్ ను భయపెడుతున్న ఫిగర్ ఇదే!

వైకాపా అధినేత జగన్ ది జాగ్రత్తో, అతిజాగ్రత్తో లేక భయమో అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు పలువురు అభిమానులు! ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో వైకాపా.. ఉన్నంతలో కాస్త బలంగా ఉన్నట్లే కనిపిస్తోంది! నిన్న మొన్నటివరకూ ప్రతిపక్షాలు కాస్త బలహీనంగానే కనిపించాయి! ఈ పరిస్థితుల్లో ముందస్తుకు కచ్చితంగా ఆలోచిస్తారనే కామెంట్లు వినిపించడం సహజం. కానీ… జగన్ ఆ ఆలోచన చేయడం లేదట! ఎందుకో ఇప్పుడు చూద్దాం!

ఏమాటకామాట చెప్పుకోవాలంటే ఏపీలో వైకాపా ఒక బలమైన శక్తిగా మారిపోయింది! 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిస్థితి దారుణంగా తయారయితే.. జనసేన అయితే ఆటలో అరటిపండులా మారిపోయిన పరిస్థితి! అనంతరం కోవిడ్ రావడం.. ప్రతిపక్షాలు మౌనంగా మారడం తెలిసిందే! అనంతరం జగన్ పాలన కాస్త ఆటుపోట్లను తట్టుకుని కుదురుకున్న పరిస్థితి. ఈ సమయంలో జగన్ ఒక ఆలోచన చేయొచ్చు! ఇదే అదనుగా ముందస్తుకు వెళ్లి, ప్రత్యర్థులు పుంజుకోకముందే చావుదెబ్బ కొట్టొచ్చు! ఇది సగటు వైకాపా కార్యకర్త భావించింది!

కానీ… జగన్ చేయించుకుంటున్న వ్యక్తిగత సర్వేలు మాత్రం జగన్ ని కాస్త ఆందోళనలో పెడుతున్నాయంట! గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన 151 సీట్ల కంటే తక్కువ వస్తే.. ప్రజలపై తనకు ఉందని భావిస్తున్న బలమైన నమ్మకం సన్నగిల్లినట్లేననేది జగన్ ఆలోచనగా ఉందట! ఇదే సమయంలో ఇక ప్రతిపక్షం అనేది ఏపీలో కనిపించకూడదు.. టీడీపీ – జనసేనలు కనుమరుగైపోవాలి అంటూ ఒక టార్గెట్ 175 కూడా పెట్టుకున్న సంగతి తెలిసిందే! దీంతో ఏదో బొటాబొటిన గెలిస్తే కాదు.. మరింత గట్టిగా కొట్టాలి అనే జగన్ ఆలోచనే ఈ భయానికి కారణం అని తెలుస్తోంది!

ఇదే క్రమంలో… వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన కార్యక్రమం… గడప గడపకు.! అయితే ఈ కార్యక్రమం విలువ తెలియకో.. లేక, బద్దకించో.. అదీగాక, అతివిశ్వాసంతోనో కొందరు నిర్లక్ష్యం చేసారనేది జగన్ బలంగా చెబుతున్న మాట. దీని ఫలితమో లేక నియోజకవర్గంలో ఆయా ఎమ్మెల్యేల పనితీరు ఫలితమో కానీ… సుమారు 50 మంది ఎమ్మెల్యేల పనితీరు జగన్ ఆశించిన స్థాయిలో లేదని.. వారిలో సుమారు 25 మంది అయితే అత్యంత దారుణంగా ఉన్నారని తెలిసిందట!

దీంతో ఈ సమయంలో కలిసొచ్చ్చిన “ముందస్తు” అవకాశాన్ని జగన్ ఉపయోగించుకోలేకపోతున్నారని అంటున్నారు వైకాపాలోని కొందరు నాయకులు! ఫలితంగా.. ఆ 50 ఫిగర్ తో పాటు.. ఆ 25 ఫిగర్ కూడా జగన్ ఆందోళనకు మరో బలమైన కారణం అని.. దాని ఫలితమే తరచు మీటింగులు – కొంతమంది నాయకులకు తలంటులు అట! మరి రాబోవు కాలంలో ఆ ఫిగర్ తగ్గుతుందా.. పెరుగుతుందా.. జగన్ “టార్గెట్ – 175” రీచ్ అయ్యేలా మారుతుందా అనేది వేచి చూడాలి!