RRR Documentary: రాజమౌళి డాక్యుమెంటరీ ప్లాన్.. సక్సెస్ అయ్యిందా లేదా?

గత శుక్రవారం బాక్సాఫీస్‌కు కొత్త సినిమాలు పెద్దగా ప్రభావం చూపించకపోయినా, ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ అనే డాక్యుమెంటరీ విడుదల కొంతమందిని ఆకర్షించింది. పరిమిత స్క్రీన్లలో మాత్రమే విడుదల చేయడం వల్ల ఇది అందరికీ చేరలేదు. అయినా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి అభిమానులకు ఇది ప్రత్యేకమైన కంటెంట్‌గా నిలిచింది. థియేటర్లకు వెళ్ళి చూసేంత ఆసక్తి అందరిలోనూ ఉండకపోవచ్చు, కానీ ఫ్యాన్స్‌కు మాత్రం ఇది ఓ మంచి ట్రీట్‌గా మారింది.

ఈ డాక్యుమెంటరీలో చరణ్ పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్, తారక్ పులితో తలపడే ఎపిసోడ్, ఇంటర్వెల్ సీక్వెన్స్, నాటు నాటు పాట వెనుక కష్టాలు, క్లైమాక్స్ గ్రీన్ మ్యాట్ షూటింగ్ వంటి అనేక అద్భుతాలు చూపించారు. ఇంతవరకు చూడని అరుదైన ఫుటేజ్, ఆన్ సెట్ వీడియోలు దీనిలో పొందుపరచడం ప్రత్యేకంగా నిలిచింది. ఇది ఫ్యాన్స్‌కు సంతృప్తి కలిగించినా, థియేటర్‌లో చూసేలా చేసిందా అనేది అనుమానమే.

దీన్ని ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయకపోవడం వ్యాపార దృష్టికోణంలో సరైన నిర్ణయంగా కనిపిస్తుంది. ఈ డాక్యుమెంటరీని త్వరగా ఓటిటిలో విడుదల చేస్తే మరింత మంది ప్రేక్షకులకు చేరుతుంది. ఫ్యాన్స్ ఎప్పటినుంచో కొత్త, ఆసక్తికరమైన ఫుటేజ్ కోరుకుంటూ ఉండగా, ఈ డాక్యుమెంటరీ వారికి కొంతవరకు ఆ ఆనందాన్ని అందించింది. అయితే మరోవైపు పుష్ప 2 ఉండడం అలాగే సంధ్య థియేటర్ కాంట్రవర్సీ ఎక్కువగా వైరల్ అవ్వడంతో రాజమౌళి డాక్యుమెంటరీ పై అంతగా ఫోకస్ పడలేదు. మహేష్ బాబు 29 వంటి కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఆర్ఆర్ఆర్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఫైనల్ గా ఈ డాక్యుమెంటరీ థియేటర్స్ లో అంతంత మాత్రంగానే ఆడింది.