చైనాలో కోవిడ్ పుట్టింది.. పెరిగింది.. ప్రపంచాన్ని వణికించింది.. వణికిస్తూనే వుంది కూడా.! దీన్ని బయో వార్.. అని కొందరు అభివర్ణిస్తున్నారు. అబ్బే, చైనా కూడా కోవిడ్ బాధిత దేశమేనంటూ ఇంకొందరు చైనాకి అండగా నిలుస్తున్నారు.!
మానవాళి వినాశనం కోసమే వచ్చినట్లుంది ఈ కోవిడ్. అసలు అదెలా తయారైంది.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. అయినాగానీ, చైనా నుంచే పుట్టిన కోవిడ్ మహమ్మారి ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలేలా కనిపించడంలేదు. వ్యాక్సిన్లు అందుబాటులో వున్నా.. అవి అత్యవసర వినియోగం కేటగిరీలో అనుమతి పొందినవే.
కోవిడ్ వైద్య చికిత్స కోసం సరైన మందులు ఇప్పటిదాకా తయారవలేదు. అందుబాటులో వున్నవాటిని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నామంతే.
ప్రపంచాన్ని ఇంతలా కోవిడ్ వణికిస్తున్నా, కోవిడ్ వస్తే నయం చేసే సరైన మందులు.. శాశ్వత వినియోగం కింద వాడాల్సిన మందులు అందుబాటులోకి రాకపోవడం ఆశ్చర్యకరమే. వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందే అవకాశం వుంటుంది గనుక, వ్యాక్సిన్ల సమర్థతపై కొన్ని అనుమానాలు వుండడమూ సహజమే.
కానీ, మానవాళి ఎన్నో వైరస్‌లను చూసింది.. కొన్నిటికి వ్యాక్సిన్లున్నాయి.. కొన్నిటికి మందులున్నాయ్.. వ్యాక్సిన్, మందులు లేనివి కూడా వున్నాయి. కానీ, కోవిడ్ తరహాలో భయపెట్టిన వైరస్ ఇంకోటి లేదన్నది నిర్వివాదాంశం. మిగతా దేశాల సంగతెలా వున్నా, 130 కోట్ల జనాభా కలిగిన భారతదేశం కోవిడ్ పేరు చెబితేనే వణికిపోతోంది.