Sunny Leone: సన్నీ లియోన్ పేరుతో.. నెలకు వెయ్యి రూపాయలు నొక్కేశాడు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మహతారి వందన యోజన పథకానికి సంబంధించిన విచిత్ర ఘటన ఒకటి వెలుగుచూసింది. ప్రముఖ నటి సన్నీ లియోన్ పేరును ఉపయోగించి, ఆమె పేరుతో పథకానికి దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం నుంచి నెలనెలా రూ. వెయ్యి పొందడం ఆశ్చర్యానికి గురి చేసింది. తాలూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు.

ఈ పథకం వివాహిత మహిళలకు నెలకు రూ. వెయ్యి చొప్పున అందజేస్తుండగా, సన్నీ లియోన్ పేరు, ఫోటోతో బ్యాంకు ఖాతా తెరవడం, అధికారుల నిర్లక్ష్యంతో ఆ దరఖాస్తుకు ఆమోదం లభించడం ఆసక్తికరంగా మారింది. రికార్డుల్లో ఆమె పేరు స్పష్టంగా కనిపించడం, నెలనెలా డబ్బు జమవడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు తలెత్తించింది. బస్తర్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసిన వెంటనే జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ ఘటనను ఆధారంగా తీసుకొని ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని, పథకం అమలులో పారదర్శకత లేకపోవడం వల్లే ఫేక్ లబ్ధిదారులు పెరుగుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు సగం మంది లబ్ధిదారులు అసలే లేరని, ఇది మరిన్ని విచారణలకు దారి తీసే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

సన్నీ లియోన్ పేరును ఉపయోగించి మోసానికి పాల్పడిన వీరేంద్ర జోషి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించి, ఇలాంటి అవకతవకలకు ఇకపై తావు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకంపై అవినీతి ఆరోపణలు ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తున్నాయి.