Chandra Babu: కర్నూలులో నిర్వహించిన కూటమి కార్యకర్తల సమావేశ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. తాను ఏం చెబితే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లేనని ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వైసీపీకి చెందిన వారు ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు వదలేసి వెళ్లాలని హెచ్చరించారు. వైసీపీ వారు లబ్ధి చేకూర్చే అన్నింటిని విడిచి పెట్టాలని, లేకపోతే లెక్క వేరేగా ఉంటుంది అంటూ వైకాపాకు చెందిన కార్యకర్తలకు ఈయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యల అనంతరం బిజెపి కార్యకర్తలు 5 రేషన్ షాపులకు తాళాలు వేశారు. మరికొన్ని చోట్ల రేషన్ షాపులు తమకే అని లాగేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ఈ ఐదేళ్ల కాలంలో వైకాపా నాయకులు దోచుకుంది చాలు ఇకపై మా వారికి వదిలేయండి అధికారుల నుండి ఎలాంటి లేఖలు తెచ్చుకోం, నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. అందరూ శాంతియుతంగా ఉండాలి.. రౌడీయిజం, గుండాయిజం నాకు నచ్చదు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.
ముఖ్యంగా నేనేం చెప్పినా సీఎం డిప్యూటీ సీఎం చెప్పినట్లేను అంటూ ఈయన మాట్లాడటంతో కొంతమంది సొంత పార్టీ నేతలే ఈయన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నారు. మరి ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యలపై అధిష్టానం ఎలాంటి స్పందన తెలియజేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.