రామ్‌చరణ్‌ని చూస్తే.. తన లోపల ఏదో శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నట్టుగా కనిపిస్తాడు. సందర్భం వచ్చినప్పుడు అది విస్పోటనం చెందుతుందేమో?! అనిపిస్తుంది. లోతైన భావాలను పలికించగల గొప్ప నటుడు తను. ఎంత కష్టసాథ్యమైన సన్నివేశాన్నయినా అద్భుతంగా హ్యాండిల్ చేయగల సమర్థత అతని సొంతం.’ అని అగ్ర దర్శకుడు శంకర్ కొనియాడారు. ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ఛేంజర్’. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లు. దిల్‌రాజు నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ కథకు రామ్‌చరణ్‌ను ఎంచుకోడానికి గల కారణాలను తెలుపుతూ దర్శకుడు శంకర్ పై విధంగా స్పందించారు. ‘ ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్‌కి ముందే రామ్‌చరణ్ ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కథకు రామ్‌చరణ్ కరెక్ట్ అని దిల్‌రాజు కూడా భావించారు. నా కథల్లో యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. పెద్ద హీరో చేస్తేనే దానికి న్యాయం జరుగుతుంది. అందుకే.. అదే పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని నేనూ భావించా. అవినీతిని నిర్మూలించే ఐఏఎస్ అధికారిగా ఇందులో చరణ్ కనిపిస్తారు. ఊహలకు అందని అద్భుతాలు ఇందులో ఉంటాయి.’ అని శంకర్ తెలిపారు.
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికాలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ ఈ వేడుకకు అతిథిగా రానున్నారు. అలాగే, ఏపీ రాజధాని అమరావతిలోనూ ఓ భారీ ఈవెంట్ జరుపనున్నట్టు తెలుస్తున్నది. ఆ వేడుకకు పవన్‌కల్యాణ్ అతిథిగా రానున్నట్టు సమాచారం.