చైనాలో కోవిడ్ విజృంభిస్తోంది. ఏకంగా కోట్లాది మందికి అక్కడ కోవిడ్ సోకినట్లుగా ప్రచారం జరుగుతోంది. మన భారతదేశంలోనే కోవిడ్ విషయమై చిత్ర విచిత్రమైన లెక్కల్ని చూశాం. అలాంటిది, చైనా లాంటి దేశాల్లో ఇలాంటి విషయాలకు సంబంధించి సరైన లెక్కలు వస్తాయని ఎలా అనుకోగలం.?
కోవిడ్ పుట్టిల్లు చైనా. అక్కడ తొలుత కరోనా వెలుగు చూశాక, అత్యంత భయానకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అపార్టుమెంట్లలో డోర్లకు మేకులు కొట్టేశారు.. ఇంట్లోంచి జనం బయటకు రాకుండా. రాత్రికి రాత్రి వందల, వేల పడకల ఆసుపత్రుల్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.
రోడ్ల మీద జనం కన్పిస్తే కాల్చివేత.. అనే స్థాయికి అక్కడ కోవిడ్ నిబంధనలు పెట్టారు. అత్యాధునిక పరికరాల్ని ఉపయోగించి కోవిడ్ వైరస్‌ని అంతం చేసే కెమికల్స్‌ని పిచికారీ చేశారు. వ్యాక్సిన్లూ పెద్దయెత్తున తయారయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేశారు చైనాలో. ప్రపంచంలో చాలా దేశాలకు చైనా వ్యాక్సిన్లు వెళ్ళాయి. వ్యాక్సిన్లే కాదు, సర్జికల్ మాస్కులు, పీపీఈ కిట్లు.. ఇలా చైనా ‘కోవిడ్’ పేరుతో చాలా వ్యాపారమే చేసింది.
మళ్ళీ ఇప్పుడు చైనాలో దుర్భరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కుప్పలు తెప్పలుగా శవాలట.. ఖననం లేదా దహనం చేయడానికి చోటు దొరకని పరిస్థితి ఏర్పడిందట. ఈ ప్రచారం ప్రపంచ మీడియాలో ఎంత జరుగుతోందోగానీ, మన ఇండియన్ మీడియా అయితే మరీ ఓవరాక్షన్ చేస్తోంది.
ఈ భయాలతోనే దేశంలో చాలామంది చచ్చిపోయే ప్రమాదం వుంది. గత కొద్ది రోజులుగా న్యూస్ ఛానళ్ళు పెట్టాలన్నా భయం.. పత్రికలు చదవాలన్నా భయం అన్నట్టుంది పరిస్థితి. ఇప్పటికైతే మన దేశం ప్రశాంతంగానే వుంది. మన వ్యాక్సిన్లు సమర్థవంతమైనవని కేంద్రం చెబుతోంది.