Sandhya Theater: సంధ్య థియేటర్ విషాదం: ఫిల్మ్ ఛాంబర్ విరాళాల పిలుపు

పుష్ప-2: ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అందరికీ తీవ్ర ఆవేదనను కలిగించింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ తన ప్రాణాలు కోల్పోగా, ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాదం సినీ పరిశ్రమ నుంచి సామాన్య ప్రజల వరకు అందరిని కదిలించింది.

రేవతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో శ్రీతేజ్ వైద్య ఖర్చుల మొత్తం బాధ్యతను ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. అలాగే, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

అలాగే, ఈ విషాదంపై తెలుగు చిత్ర పరిశ్రమ కూడా స్పందించింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధిత కుటుంబానికి తమ వంతు సాయం చేయాలని నిర్ణయించింది. ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు తమ విరాళాలను అందజేసేందుకు బ్యాంక్ ఖాతా వివరాలను ప్రకటించింది. చిన్నారి శ్రీతేజ్ వైద్యంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని ఫిల్మ్ ఛాంబర్ పిలుపునిచ్చింది.

ఇకపోతే, డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబిత కూడా రేవతి కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందించనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు వ్యక్తిగతంగా ఆసుపత్రి వెళ్లి పరామర్శించడంతో పాటు, బాధిత కుటుంబానికి తమ మద్దతు ప్రకటించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగుపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.