పార్లమెంట్ సమావేశాలు మళ్లీ ఉద్రిక్త వాతావరణానికి వేదికగా మారాయి. గురువారం చోటుచేసుకున్న తోపులాటలో బీజేపీ ఒడిశా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు గాయమై ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో అధికార బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వివాదం తారస్థాయికి చేరి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ ఎంపీ సారంగి మీడియాతో మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ మరో ఎంపీని తోసేయడంతో ఆయన నాపై పడ్డారు. అందుకే నేనూ కిందపడి గాయపడ్డాను,” అని వ్యాఖ్యానించారు. బీజేపీ వర్గాలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనను ఖండిస్తూ, రాహుల్ గాంధీపై అధికారిక ఫిర్యాదు చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.
దీంతో, రాహుల్ గాంధీ తాము ఎవరికీ అడ్డంకిగా మారలేదని, బీజేపీ ఎంపీలే తమను సభలోకి వెళ్ళకుండా అడ్డుకున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై స్పష్టత కోసం పార్లమెంట్ భవనం కెమెరా ఫుటేజీని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ మాట్లాడుతూ, “ఈ ఘటనలో మా తప్పేమీ లేదు. నిజాలు బయటపెట్టాలంటే వీడియోలు పరిశీలించాలి,” అని అన్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటన పార్లమెంట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సభ్యుల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కుతోంది. నేతలు ఈ సంఘటనను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య వేదిక ఇలా వివాదాలకు అడ్డా కావడం పట్ల చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Delhi | BJP MP Pratap Chandra Sarangi says, “Rahul Gandhi pushed an MP who fell on me after which I fell down…I was standing near the stairs when Rahul Gandhi came and pushed an MP who then fell on me…” pic.twitter.com/xhn2XOvYt4
— ANI (@ANI) December 19, 2024