మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం పదవిపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. గత కొన్ని రోజులుగా నేతల మధ్య విబేధాలు వచ్చినట్లు అనేక రకాల కామెంట్స్ వినిపించాయి. అసలైన రాజకీయ వివాదాలు ఇబ్బందులు ఇప్పుడే వస్తాయి అన్నట్లుగా ప్రతిపక్ష పార్టీలు హేళన చేశాయి. ఇక ఫైనల్ గా బీజేపీ కోర్ కమిటీ సమావేశం తర్వాత, పార్టీ ఎమ్మెల్యేల ఏకగ్రీవ మద్దతుతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యారు.
ఈ నెల 5న ఆయన ముంబైలోని ఆజాద్ మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం పదవితో పాటు హోంమంత్రి, శాసనసభ స్పీకర్ పదవులను బీజేపీ తనవైపు లాగుకోగా, ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం), శివసేన (ఏక్ నాథ్ షిండే వర్గం) పార్టీలకు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించారు. మంత్రివర్గ విస్తరణలో 43 మంది మంత్రులకు అవకాశం ఉంటే, అందులో 21 మంది బీజేపీకి, 12 మంది షిండే వర్గానికి, 10 మంది ఎన్సీపీ వర్గానికి చెందుతారు.
మాజీ ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ గతంలో తన విధానాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారు. ఆయన ఆర్థిక నియంత్రణా విధానాలు, పారదర్శక పాలనలో బీజేపీకి పునరాలోచనల అవసరాన్ని తొలగించాయి. ఫడ్నవీస్ నియామకంతో రాష్ట్ర స్థాయిలో రాజకీయ సమీకరణాలు బలపడ్డాయి. ఈ సారి బీజేపీ విజయంతో పార్టీలో ప్రధాన పదవులు తిరిగి సంపాదించుకోవడంతో పాటు, పార్టీలో తమ ప్రభావాన్ని నిలబెట్టుకుంది. ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో మంత్రివర్గంలో సమతుల్యతను సాధించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మహారాష్ట్రలో ఈ కొత్త ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుందో చూడాలి.