ఇండియా కూటమిలో విబేధాలు: ఒంటరైపోతున్న కాంగ్రెస్

ఇండియా కూటమిలో పార్టీల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అండగా నిలుస్తున్న ప్రాంతీయ పార్టీలు తాజాగా తమ స్వంత డిమాండ్లపై దృష్టి సారించడం గమనార్హం. ఇటీవల పార్లమెంట్‌లో కీలకమైన ఆందోళనలు జరుగుతున్నప్పటికీ, ఈ వివిధ పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం ప్రతిపక్ష కూటమికి సంక్షోభాన్ని తేలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వంటి పార్టీలు తమ సొంత రాష్ట్ర సమస్యలపై ఆందోళనలు ప్రారంభించాయి.

ఎస్పీ ఎంపీలు ఉత్తరప్రదేశ్‌లో రైతులకు న్యాయం చేయాలని పట్టుబట్టగా, టీఎంసీ ఎంపీలు పశ్చిమ బెంగాల్‌కు నిధుల విడుదలపై కేంద్రాన్ని నిలదీశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అదానీ కేసు ఆందోళనకు ఈ పార్టీలు మద్దతు ఇవ్వకపోవడం, బీజేపీని ఎదుర్కొనే ప్రతిపక్ష ఐక్యత మీద అనుమానాలను రేకెత్తిస్తోంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసనకు దిగినప్పటికీ, మిగతా కూటమి పార్టీల నిర్లిప్తత ఈ పోరాటానికి ఊపందించలేదు.

అదానీ వ్యాపారంపై అమెరికాలో నమోదైన కేసులు, మణిపూర్ అల్లర్లు వంటి అంశాలు కాంగ్రెస్ ప్రధాన డిమాండ్లుగా ఉండగా, ఇతర పార్టీలకు వీటిపై పెద్దగా ఆసక్తి లేకపోవడం కాంగ్రెస్ ఒంటరితనాన్ని పెంచుతోంది. ఇండియా కూటమిలో ఈ విభేదాలు బీజేపీకి మరింత బలం చేకూరుస్తున్నాయి. పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీల ఐక్యత లేదని చాటిచెప్పేలా బీజేపీ నాయకత్వం దీన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తోంది.

గతంలో వ్యవసాయ చట్టాలపై ఉద్యమం, మణిపూర్ అంశం, ఇప్పుడు అదానీ వ్యవహారం విషయాల్లోనూ చివరకు కాంగ్రెస్ ఏకాకి కావడం, బీజేపీ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచడం స్పష్టమవుతోంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, కూటమి అంతర్గత విభేదాల కారణంగా మరింత ఒంటరితనానికి గురవుతుండటం పార్టీ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారింది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఏకంగా ముందుకెళ్లగలిగితేనే బీజేపీని ఎదుర్కోవడం సాధ్యం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.