హాలీవుడ్‌ మ్యాగజైన్‌లో దీపికా పడుకొణె!

డెడ్‌లైన్స్‌ గ్లోబల్‌ డిస్‌రప్టర్స్‌ అనే హాలీవుడ్‌ మ్యాగజైన్‌ ప్రతీ ఏడాది.. ప్రపంచవ్యాప్తంగా వినోదరంగంలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నటీనటుల జాబితాను విడుదల చేస్తుంది. ఇటీవలే విడుదల చేసిన ఈ ఏడాది జాబితాలో ప్రముఖ బాలీవుడ్‌ అగ్రతార దీపికా పదుకొణె చోటు దక్కించుకుంది. ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయ నటిగా దీపిక నిలిచింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..కొన్ని ఆసక్తికర విషయాల్ని తన అభిమానులతో పంచుకుంది.

‘నటించిన సినిమా విజయం అందుకోవాలి, బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురవాలి, పాత్ర మెప్పించాలి, సినీ ప్రియులు కథనంతో పాటు సాగిపోయేలా కథలను ఎంపిక చేసుకోవాలి, అవార్డులు ప్రశంసలు దక్కాలి, మంచి స్థాయిలో ఉండాలి..ఇలా ఇవే ముఖ్యమంటారు కొందరు నటీనటులు. నా దృష్టిలో ముఖ్యమైనవి ఏమైనా ఉన్నాయంటే అది ఒక మంచి వ్యక్తిగా ఎదగడం, మంచి వ్యక్తులతో సమయం గడపడం, సెట్‌లోని అనుభవాలను మర్చిపోలేని జ్ఞాపకాలుగా గుర్తుచేసుకోవడం. ఇవే నాకు ముఖ్యం. ఇప్పుడీ గౌరవానికి కూడా కారణం అదే అని నా అభిప్రాయం’.

ప్రపంచం చాలా చిన్నదై పోయిందని నేను అనుకుంటున్నా. సినీ రంగంలోని పరిశ్రమలన్నీ ఒక్కచోట చేరి ఈ ప్రపంచానికి గొప్ప కథలు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. మనం చెప్పే కథల వల్లే ఈ ప్రపంచంలో మార్పులు వస్తున్నాయని నేననుకోవట్లేదు. ప్రేక్షకులు మెచ్చేలా, ఆశ్చర్యపోయేలా, ఆసక్తికరమైన కథలు మాత్రమే మనం చెబుతున్నాం. అదే జరుగుతుంది కూడా’. ‘ఓం శాంతి ఓం’ సినిమా కోసం నేను అసలు ఆడిషన్‌ ఇవ్వలేదు. 2007లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రంతోనే నేను బాలీవుడ్‌కి పరిచయమయ్యా. దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ ఏ ఆడిషన్‌ చేయకుండానే నన్ను ఎంపిక చేశారు.అలా మొదలైన నా ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నా’. ‘బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లోనూ నన్ను ప్రేక్షకుల ఆదరిస్తున్నారు.

పదేళ్ల క్రితం నేను హాలీవుడ్‌ సినిమాలకు ఆడిషన్‌ ఇచ్చా. అక్కడంతా కొత్త విధానం. అక్కడి సినిమాలోని నటనకు తగ్గట్టు నేను ఫాన్సీ యాక్టింగ్‌ స్కూల్లో చేరలేదు, ఇంగ్లిష్‌ నటనలో శిక్షణ తీసుకోలేదు. కానీ ఒక్కసారి హాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత ఇంగ్లిష్‌ సినిమాలకి తగ్గ నైపుణ్యాలను నేర్చుకున్నట్లు చెప్పారు.