Rahul Gandhi: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో సభ్యుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఈనెల 20వ తేదీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 18వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలకు అనుమతి ఉంది. అయితే కూటమి సభ్యులుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలో పర్యటించాల్సి ఉంది. ఇక చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర షెడ్యూల్ కూడా ఖరారు అయినప్పటికీ ఉన్నఫలంగా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించడంతో చంద్రబాబు షెడ్యూల్ క్యాన్సిల్ అయింది.
ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈయన పలు సభలలో పాల్గొంటూ రేవంత్ రెడ్డి పై అలాగే కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే మరో వైపు రాహుల్ గాంధీ మాత్రం చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేయడంతో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది. ఇలా మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడుకి రాహుల్ గాంధీ ఫోన్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనే విషయానికి వస్తే..
ఇటీవల చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఇక ఈయన మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ కూడా తన సోదరుడి మరణం పట్ల చంద్రబాబు నాయుడుని పరామర్శించి సానుభూతి తెలియజేశారని తెలుస్తోంది.
రామ్మూర్తి నాయుడు గతంలో తెలుగుదేశం పార్టీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు అయితే ఆయన వ్యక్తిగత కారణాలవల్ల రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. గత కొద్దిరోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇలా చికిత్స పొందుతున్న ఈయన పరిస్థితి కాస్త విషమించడంతో శనివారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. విజయవాడలో ఉన్నటువంటి లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు.
రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నేడు నారావారిపల్లెలో జరుగునున్నాయి. ఇక ప్రత్యేక విమానంలో చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులందరూ కూడా నారావారిపల్లెకు చేరుకొని అంత్యక్రియలను పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తుంది.