బాలయ్య, చిరుల కొత్త సినిమాలపై ఆసక్తి!

ఒకవైపు కొత్త సినిమాల విడుదలలు… మరోవైపు కొత్త కలయికల ప్రకటనలతోనూ చిత్రసీమ ఎప్పుడూ సందడిగా కనిపించేది. కానీ కొన్ని నెలలుగా స్తబ్దత నెలకొంది. ఎన్నికలు, ఐపీఎల్‌ కారణంగా విడుదలలు లేక వేసవి సీజన్‌ తుడిచి పెట్టుకుపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ చిత్రసీమలో మునుపటి వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొత్త సినిమాల విడుదలలు ఊపందుకున్నాయి. వారం వారం మూడు సినిమాలొస్తున్నాయి. ఈ నెలలోనే ‘కల్కి 2898 ఎ.డి’ రాబోతోంది. కొత్త సినిమాల ప్రకటనలకీ రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ వేడుకలో పాల్గొన్న అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ‘మాది ఓ కాంబినేషన్‌ ఉంది, త్వరలోనే ప్రకటిస్తామ’ని చెప్పారు.

‘విశ్వంభర’ చిత్రీకరణతో బిజీగా గడుపుతున్న మరో అగ్ర నటుడు చిరంజీవి నుంచీ ఓ కొత్త ప్రకటన వెలువడే అవకాశాలున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. బి.వి.ఎస్‌.రవి కథని సిద్ధం చేశారు. సాయిదుర్గా తేజ్‌ సహా యువ కథానాయకులు నటించే పలు చిత్రాలు అధికారిక ప్రకటనల కోసం సిద్ధమవుతున్నాయి.