‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ పొగాకు కంపెనీల ఉత్పత్తుల్లో నటించేందుకు నిరాకరించారు. ఓ యాడ్‌లో నటిస్తే పదికోట్లు ఇస్తామన్న ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. ఇలా పొగాకు ఉత్పత్తులకు సంబంధించి తన దగ్గరకు వచ్చిన ఓ ప్రకటనను మరో ఆలోచన లేకుండా తిరస్కరించారు. అభిమానులను తప్పుదోవ పట్టించి, వారి ఆరోగ్యానికి నష్టం కలిగేలా ఎప్పుడూ ప్రవర్తించనని స్పష్టం చేశారు. కేవలం నటన మాత్రమే కాదు, సామాజిక బాధ్యతల విషయంలో అల్లు అర్జున్ ముందుంటారు. ఇప్పటికే మొక్కలు నాటే కార్యక్రమానికి తనవంతు ప్రచారం చేస్తూ, అభిమానులను సైతం ప్రోత్సహిస్తున్నారు. డబ్బు, పేరు ప్రఖ్యాతులు కన్నా కూడా అభిమానుల ప్రేమకే ఎక్కువ విలువ ఇస్తానని పలు వేదికలపైనా చెప్పారు.
వరల్డ్ టుబాకో డే సందర్భంగా ఈ విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప: ది రైజ్’. ఈ మూవీ విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా పుష్పరాజ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రముఖ పొగాకు ఉత్పత్తుల సంస్థ బన్నీని కలిసింది. తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉండాలని కోరింది. ఈ ఆఫర్‌ను ఆయన నిర్మొహమాటంగా తిరస్కరించారట.
ఈ యాడ్ చేస్తే రూ.10 కోట్ల వరకూ ఇస్తామని ఆఫర్ చేసినా, చేయనని స్పష్టంగా చెప్పారట. నేరుగా తీసుకోకపోయినా ‘పుష్ప: ది రూల్’లో పుష్పరాజ్ ధూమపానం చేసే ప్రతి సీన్‌లోనూ బ్యాగ్రౌండ్‌లో తమ బ్రాండ్ లోగో కనిపించేలా చూడాలని కోరిందట. అందుకు కూడా బన్నీ నో చెప్పారట. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘పుష్ప2: ది రూల్’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, సునీల్, రావు రమేశ్, అనసూయ, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రంలోని పాటలు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.