పీఎం- కిసాన్‌ సమ్మాన్‌ నిధి పెంపు… వివరణ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం…?

దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చింది. రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి అనే మరొక పథకం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.6వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తం రూ.6వేలు రూపాయలు మూడు విడతల్లో ఒక్కో విడతకి రూ.2 వేలు చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏడాదికి రూ. 6000 చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ రూ. 6000 కు మరో రూ.2వేలు జత చేస్తారని, బడ్జెట్‌లో ఆ మేర బడ్జెట్‌లో ప్రకటన ఉంటుందని అంతా ఆశించారు. అంతేకాకుండా దీని గురించి విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ఇక ఈ ఏడాది ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పెంపు గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో ఇంతకాలం కేంద్ర ప్రభుత్వం అదనంగా మరొక 2000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోందని ఎంతో ఆనందించిన రైతులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

తాజాగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి పెంపు పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం రైతులకు అందిస్తున్న పీఎం-కిసాన్‌ మొత్తాన్ని పెంచే ఉద్దేశం లేదని కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి పెంపు గురించి సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా జనవరి 30 వరకు అర్హులైన రైతులకు మొత్తం రూ.2.24 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నూరు శాతం నిధులు సమకూరుస్తోందని ఆయన వెల్లడించారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పెంపు పై వినిపిస్తున్న వార్తలలో నిజం లేదని స్పష్టం చేశారు.