జలియన్ వాలాబాగ్ ఉచకోతకు ఇంగ్లండ్ క్షమాపణ, త్వరలో ప్రకటన

జలియన్ వాలా బాగ్ ఉచకోతకు క్షమాపణలు చెప్పేందుకు ఇంగ్లండ్ ప్రభుత్వం సిద్ధ మవుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ లో జనరల్ డయ్యర్ జరిపిన ఉచకోతకి నూరేళ్లు పడతాయి. 1919 ఏప్రిల్ 13, వైశాఖి దినం నాడు పంజాబ్ లోని అమృత్ సర్, జలియన్ వాలా బాగ్ లో గుమికూడిన ప్రజల మీద యాక్టింగ్ మిలిటరీ క మాండర్ జనరల్ ఆర్ ఇ హెచ్ డయ్యర్ సైనికులను ఉసి గొల్పి కాల్పులు జరిపించాడు.

సుమారు పది నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. ఎవరూ తప్పించుకుని పారిపోకుండా ఉన్న ఒకే ఒక్క గేటుదగ్గిర డయ్యర్ స్వయంగా అడ్డంగానిలబడ్డాడు. ఆయనకు తోడుగా అనేక మంది పోలీసులు. వారి వాహనాలు అడ్డంగా మొహరించి ఉన్నాయి. ఈ హత్యాకాండలో 379 మంది చనిపోయారు. మరక 1200 మంది గాయపడ్డారు. కాల్పలు నుంచి తప్పించుకునేందుకు కొంతమంది అక్కడి పాడుపడిన బావిలో దూకారు.వారంతా చనిపోయారు. ఆ స్థానంలో ఇపుడు అమరవీరుల బావి స్మారక స్థూపం వచ్చింది.

జలియన్ వాలా బాగ్ పాడుపడిన బావి ఇలా స్మారక స్థూపంగా మారింది.

ఇది బ్రిటిష్ చరిత్రలో ఒక మాయని రక్తపు మచ్చగా మిలిగిపోయింది. అందుకే మారిన జాతీయ అంతర్జాతీయ పరిస్థితులలో బ్రిటన్ ప్రభుత్వం హుందాగా మానవతా దృక్పధం ప్రదర్శించాల్సి ఉందని, ఈ దుర్ఘటన మీద బ్రిటన్ భారతదేశానికి క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. బయటి ప్రపంచంలోనే కాదు, బ్రిటిష్ పార్లమెంటులో ఉన్న భారతీయ సంతతి సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. జలియన్ వాలా బాగ్ ఊచకోతకు నూరేళ్లపడుతున్న సందర్బం క్షమాపణలు చెప్పేందుకు సరైందని కూడా అంతా సూచిస్తున్నారు.

క్షమాపణలు చెప్పాలన్నడిమాండ్ ఇపుడు బ్రిటిష్ ప్రభత్వం పరిశీనలో ఉంది. ఈ విషయం బ్రిటిష్ ఎగువ సభలో మంగళవారం నాడు చర్చకు వచ్చింది. ‘అమృత్ సర్ ఊచకోతకు నూరేళ్లు ’(Amritsar Massacre: Centenary) అనే అంశం మీద సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చకు స్పందిస్తూ ప్రభుత్వ విప్ ఎనబెల్ గోల్డీ ఈ ఉచకోత కు క్షమాపణలు చెప్పేందుకు జరుగుతున్న ఏర్పాట్లను ధృవీకరించారు. నూరేళ్ల సందర్భం దీనికి చాలా అనువైనది, గౌరవప్రదమయినది అని ఆమె వ్యాఖ్యానించారు.

‘ ఆరోజున్న ప్రభుత్వం ఈ ఉచకోతని పూర్తిగా ఖండించిన విషయం మనకు తెలిసిందే. అయితే, తర్వాత వచ్చిన ప్రభుత్వాలేవీ క్షమాపణలు చెప్పలేదు,’అని గోల్డీ అన్నారు.

‘చరిత్రను పునర్లిఖించలేమని, గతంలో మనం బందీకాకూడదని ఆ నాటి ప్రభుత్వాలు భావించి ఉండవచ్చని నేననుకుంటున్నాను,’అని ఆమె అన్నారు. అయితే, ఇదే విషయంమీద, అంటే ఊచకోత నూరేళ్ల సందర్భం క్షమాపణలు చెప్పేందుకు అనువయిన సమయమనే విషయం మీద, పార్లమెంటు విదేశీ వ్యవహారాల కమిటీ ముందు బ్రిటిష్ ఫారిన్ సెక్రెటరీ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.

విదేశీ వ్యవహారాల సెక్రెటరీ ఈ విషయం గురించి యోచిస్తున్నారని, ఇపుడు ఈ చర్చ సందర్బంగా సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కూడా పరిగణనలోనికి తీసుకోవడమే కాదు, వాటిని విదేశాంగ శాఖ కూడా తెలియచేయడం జరగుతుందని కూడా ఆమె చెప్పారు.

భారతీయ సంతతికి చెందిన సభ్యులు లార్డ్ రాజ్ లూంబా, మేఘ్నాద్ దేశాయ్, శాండి వర్మ, వంటి వాళు ప్రభుత్వం తన విధానం మార్చుకుని క్షమాపణలు చెప్పాలని చేసిన సూచనల దృష్టిలో పెట్టుకుని గోల్డీ ఈ విషయాలు చెప్పారు.

జలియన్ వాలా బాగ్ ఉచకోత జరిగినపుడు జనరల్ డయ్యర్ దుశ్చర్యలను అప్పటి హౌస్ ఆఫ్ లార్డ్స్ ఖండించలేకపోయిన విషయాన్ని లార్డ్ మేఘ్నాధ్ దేశాయ్ సభ దృష్టికి తెచ్చారు.

కోబ్రా బీర్ సంస్థ సంస్థాపకుడు లార్డ్ కరణ్ బిలిమోరియా జలియన్ వాలా బాగ్ ఘటనని ‘హత్య’గా వర్ణించారు.ప్రభుత్వ క్షమాఫణలు చెప్పాలన్న వివిధ వర్గాల ప్రజల డిమాండ్ ను పునరుద్ఘాటించారు. అమృత్ సర్ పట్టణానికే చెందిన బెరానెస్ శాండి విద్య కూడా క్షమాపణలు చెప్పడం చాలా గౌరవప్రదమయిన చర్య అని పేర్కొన్నారు.