ఏపీ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు సభలో టీడీపీ నేతలు చేసిన రగడ అంతా ఇంతా కాదు! స్పీకర్ పోడియం ను చుట్టుముట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగ నినాదాలు చేయడం, ఒక సమయంలో స్పీకర్ ను తాకేపనికి పూనుకోవడం వంటి కార్యక్రమాలతో రచ్చ చేశారు! అక్కడికి ప్రజలు ఎందుకు పంపించారాన్నే ఇంగిత కోల్పోయినట్లు ప్రవర్తించారు!
ఈ సమయంలో మిగిలిన టీడీపీ నేతలదంతా ఒకెత్తు, బాబు లోపలుంటే ఆ సీటు కోసం పరితపిస్తున్నారనే మాటలు మూటగట్టుకుంటున్న బాలయ్యది మరోకెత్తు అన్నట్లుగా సాగింది ఒక సంఘటన. అదే… ఇంతకాలం సినిమాల్లో చూపించిన నట విశ్వరూపాన్ని బాలయ్య ప్రజాస్వామ్య దేవాలయంలో చూపించడం.
సినిమాల్లో తొడలు కొట్టే బాలయ్య… తొడకొట్టి దూరంగా ఉన్న కుర్చీలను, సోఫాలను దగ్గరకు లాగుతుంటారు. మరికొన్ని సార్లు శృతిమించి తొడకొట్టి రైలును వెనక్కి పంపించేస్తుంటారు.. ఈ పరాకాష్ట సన్నివేశాలు సినిమాల్లోనే జనం చూడలేక చీపో అంటుంటారని అంటుంటారు. అలాంటిది అసెంబ్లీలో సైతం బాలకృష్ణ తొడకొట్టడం, మీసం తిప్పడం వంటి వికృత చేష్టలు చేశారు!
అయితే ఈ విషయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం… మొదటి తప్పుగా పరిగణించారు. మరోసారి ఇలాంటి వికృత చేష్టలు చేయొద్దని ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అనంతరం టీడీపీ సభ్యులందరినీ ఒకరోజు సస్పెండ్ చేశారు. అయితే… సస్పెన్షన్ అనంతరం బయటకు వెళ్తున్న క్రమంలో కూడా బాలయ్య తన దిగజారుడు తనాన్ని బయటపెట్టుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కారణం… వైసీపీ నేతలవైపు చూస్తూ బాలయ్య అసభ్యకరంగా చేయి చూపించారు.
ఈ నేపథ్యంలో… బాలకృష్ణ చేష్టలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఊపిరాడనివ్వకుండా వాయించి వదిలే పనికి పూనుకున్నారు. గుక్కతిప్పుకోనివ్వకుండా సెటైర్లు పేల్చారు. వీరిలో మరి ముఖ్యంగా ఆర్కే రోజా, అంబటి రాంబాబు తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా.. “ఫ్లూటు చంద్రబాబు ముందు ఊదు… వైసీపీ నేతల ముందు కాదు” అంటూఉ లెజెండ్ డైలాగుని రివర్స్ లో ఇచ్చారు.
అనంతరం… శాసనసభ సమావేశాలను బాలకృష్ణ సినిమా షూటింగ్ అనుకుంటున్నారా అంటూ రోజా మండిపడ్డారు. బావ కళ్లలో ఆనందం కోసమే బాలకృష్ణ మీసాలు మెలేస్తున్నాడని అన్నారు. తనకు ఓటేసిన హిందూపురం ప్రజల సమస్యల కోసం ఏనాడూ అసెంబ్లీలో మాట్లాడని బాలయ్య… అక్రమంగా ప్రజల డబ్బును దోచేసి అరెస్ట్ అయ్యాడని తెలిసినా కూడా అల్లరి చేస్తునారని తెలిపారు.
చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి మొత్తం బయటికి తీస్తామని.. దమ్ముధైర్యం ఉంటే బాలకృష్ణ చర్చకు సిద్ధమై సభకు రావాలని ఛాలెంజ్ విసిరారు. ఇదే సమయంలో… తండ్రి ఎన్టీఆర్ మీద చెప్పులు వేసినప్పుడు చంద్రబాబుపై మీసాలు తిప్పి, తొడలు కొట్టీ ఉంటే రాష్ట్ర ప్రజలు హర్షించేవారని హితవు పలికారు.
మరోపక్క… ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ చేసిన ఓవరాక్షన్ పై సభలో ఫైరయిన మంత్రి అంబటి రాంబాబు.. ధమ్ముంటే రా అంటూ ఛాలెంజ్ చేశారు. తొడలు కొట్టడాలు, మీసాలు తిప్పడాలు వంటివీ పోయి సినిమాల్లో చేసుకోమని సూచించారు.
అనంతరం ట్విట్టర్ వేదికగా మరోసారి కౌంటర్ ఇచ్చారు. “నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని.. మీసం తిప్పితే ఊరుకోడానికి.. ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ!.. నాది తెలుగు గడ్డ!” అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో… ఈ ట్వీట్ ఎందుకు వేశారో అర్ధమైన నెటిజన్లు… ఇక బాలయ్యకు దబిడి దిబిడే అంటూ కామెంట్లు పెడుతున్నారు.