ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల్లో పిఠాపురం ముందు వరుసలో ఉంటుందనేది తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ నియోజకవర్గంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆసక్తినెలకొందనే చెప్పాలి. అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!… జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నియోజకవర్గంలో పోటీ చేయడమే అనేది తెలిసిన విషయమే. అయితే తాజాగా ఒక కీలక చర్చ తెరపైకి వచ్చింది. అదేమిటనేది ఇప్పుడు చూద్దాం…!
ప్రస్తుతం పిఠాపురంలో పోటీకి వైసీపీ తరుపున వంగ గీత, కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాన్ లు నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో రెండు పీజీలు చేసినట్లు వంగ గీత తెలపగా.. పదో తరగతి పాసైనట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ విద్యార్హతల సంగతి కాసేపు పక్కనపెడితే… అనుభవం పరిపాలనకు చాలా ముఖ్యం అంటూ పవన్ 2014 ఎన్నికల సమయంలో కానీ.. 2024 ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థి టాపిక్ వచ్చినప్పుడు కానీ ప్రస్థావించారు!
చంద్రబాబుకి పరిపాలనలో అనుభవం ఉందని.. అది రాష్ట్రానికి ఉపయోగపడుతుందని.. 2014లో చెప్పిన పవన్.. ఏ మేరకు ఉపయోగపడిందనే విషయాన్ని 2019 ఎన్నికల సమయంలో ఓపెన్ గానే చెప్పారు! ఈ క్రమంలో మరోసారి 2024 ఎన్నికలకు వచ్చేసరికి.. తనకు అనుభవం లేదని, చంద్రబాబుకి అనుభవం ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నట్లుగా చెప్పి.. జనసైనికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
సరిగ్గా ఇప్పుడు అదే అనుభవాన్ని పిఠాపురంలో వైరల్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇందులో భాగంగా… పదోతరగతి చదివి, గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన అనుభవం పవన్ కి ఉంటే… ఉన్నత విద్యావంతురాలు అయిన గీత.. దేశంలోనే ఉన్నతమైన రాజ్యసభ, లోక్ సభలలో మెంబర్ గా పనిచేశారు. అలాగే ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్ పర్సన్, ఇతర పదవులు అనేకం నిర్వహించారు.. ఆమెది సుదీర్ఘమైన రాజకీయ జీవితం అని చెబుతున్నారు.
ఇక జ్వరం వస్తే హైదరాబాద్ కు వెళ్లిపోయే వ్యక్తి పవన్ కల్యాణ్.. ఎన్నికల కోసం అద్దె ఇళ్లు తీసుకున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అయితే… గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన వంగ గీతకు పిఠాపురంలో అణువణువూ తెలుసని.. ప్రజలకు కూడా ఆమె ఏమిటో తెలుసని చెబుతున్నారు. ఇదే సమయంలో… జనాలు అందుబాటులో ఉన్న వారిని తమ ఎమ్మెల్యేగా చేసుకుంటారు తప్ప నిర్మాత ఫోన్ చేస్తే హైదరాబాద్ కి వెళ్లిపోయే సెలిబ్రిటీలను చేసుకోరని వైసీపీ నేతలు పోస్టులు పెడుతున్నారని తెలుస్తుంది.
ఇన్ని మైనస్ ల మధ్య పవన్ కు ప్లస్ పాయింట్స్ ఉన్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా పిఠాపురంలో సుమారు 90వేల పైచిలుకు కాపుల ఓట్లు ఉండగా… అందులోని కాపు యువత ఓట్లు మెజారిటీగా పవన్ కే దక్కుతాయని చెబుతున్నారు. ఇక పెద్దవాళ్లు, కాస్త లోకం గురించి తెలిసినవారు మాత్రం గీత వైపే మొగ్గుచూపే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇదే సమయంలో మొత్తం రెండు లక్షల 32 వేల ఓట్లలో లక్షా ఎనభై వేల దాకా పోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో… వాటిలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లలో అధికశాతం వైసీపీకే పడతాయని పలువురు బల్లగుద్ది చెబుతున్న పరిస్థితి. దీంతో కచ్చితంగా వంగ గీతకు లక్షపైన ఓట్లు వస్తాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాపు యువత తప్ప మిగిలినవారంతా వైసీపీకే ఓటు వేస్తామని చెబుతున్నారని అంటున్నారు.
మరోపక్క పైకి వర్మ అనుచరులు జై జనసేన అని అంటున్నా… పోలింగ్ బూత్ కి వెళ్లాక వారి మనసు సెకండ్ థాట్ కి వెళ్లే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. కారణం… ఈసారి పవన్ ని అక్కడ గెలిపిస్తే ఇక పాతుకుపోతారని.. ఇక వర్మ కు కానీ, ఆయన కుటుంబ సభ్యులకు కానీ పిఠాపురం ఎమ్మెల్యే టిక్కెట్ గురించి ఆలోచించే అవకాశం కూడా ఉండదనే ఆందోళన వారిలో ఉందని చెబుతున్నారు.
ఈ విషయాలన్నీ భేరీజు వేస్తున్న వైసీపీ నేతలు… పిఠాపురంలో వంగా గీతకు తక్కువలో తక్కువ పాతిక వేల ఓట్ల మెజారిటీ ఖాయమని చెబుతున్నారు. ఇదే క్రమ్మలో… 2019 ఎన్నికల్లో పెండెం దొరబాబుకు 14 వేల పై దాటి మెజారిటీ వచ్చింది. ఈసారి మరో 10 – 11 వేలు అదనంగా గీతకు వస్తాయని ధీమాగా చెబుతున్నారు. మరి వైసీపీ నేతలు చెబుతున్న లెక్కలు ఏ మేరకు నిజమవుతాయనేది వేచి చూడాలి!!