చాలా చిత్రమైన పొలిటికల్ లీక్ ఇది. లీక్ వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచే. జనసేన పార్టీకి పొత్తు ధర్మంలో భాగంగా 60 నుంచి 65 సీట్లు ఖరారయ్యాయన్నది ఆ లీకు సారాంశం. టీడీపీ లెటర్ హెడ్ మీద ఆ విషయాన్ని ప్రింట్ చేసి మరీ కొందరు సర్క్యులేట్ చేస్తున్నారు.
చిత్రమైన విషయమేంటంటే, జనసేన శ్రేణులు ముందూ వెనుకా చూసుకోకుండా ఈ లెటర్ని సర్క్యులేట్ చేసెయ్యడం మొదలు పెట్టారు. తమ ప్లాన్ బాగానే వర్కవుట్ అవుతుండడంతో.. సాయంత్రం వరకు ఈ గేమ్‌ని టీడీపీ బాగానే ఎంజాయ్ చేసింది.
ఉదయం నుంచీ సాయంత్రం వరకు నడిచిన హైడ్రామా, సాయంత్రానికి ముగిసింది. ‘ఇదంతా ఉత్తదే.. ఫేక్ ప్రచారం..’ అంటూ టీడీపీ నుంచి ఖండన ప్రకటన కూడా వచ్చేసింది. ‘నువ్వే లీకులు ఇచ్చి, నువ్వే ఖండిస్తావా.?’ అంటూ టీడీపీ మీద జనసేన శ్రేణులు మండిపడటం షురూ అయ్యింది.
కాదు కాదు, ఇదంతా వైసీపీ మార్కు ఛండాలం.. అంటూ తెలుగు తమ్ముళ్ళు, జనసైనికుల్ని ఓదార్చడం మొదలు పెట్టారు. ఈ ఓదార్పులు, బుజ్జగింపులు కొంత మేర పని చేశాయనుకోండి.. అది వేరే సంగతి.
జనసేన పార్టీకి 72 సీట్లు రావొచ్చంటూ, జనసేన నుంచే అనధికారికంగా ఓ ప్రచారం తెరపైకొచ్చింది. దానికి కౌంటర్ ఎటాక్ అన్నట్టుగా 60 నుంచి 65 లెక్క టీడీపీ నుంచి ప్రచారంలోకి వచ్చినట్లు భావించాలేమో. ఇంతా చేసి, అసలు లెక్క, పాతికకు మించకపోవచ్చన్నది తాజా ఖబర్.
అదే గనుక జరిగితే, జనసేన పార్టీ, టీడీపీ చేతులో ఇరుక్కుపోయినట్లే.