Tirupathi: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన టికెట్లకు సంబంధించిన టోకెన్లను జారీ చేయడంతో లక్షల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో భాగంగా ఇప్పటివరకు 6 మంది మరణించగా 40 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇలా గాయపడిన వారందరినీ కూడా తిరుపతిలోని పలు ఆసుపత్రిలలో చేర్చించి చికిత్స అందజేస్తున్నారు.
ఇక ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలుకొని ఇప్పటికే ఎంతోమంది ఈ ఘటనపై స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏపీ సర్కార్ మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్క్రీషియ ప్రకటించగా కోటి రూపాయలు ఇవ్వాలనీ డిమాండ్లు కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడానికి కారణం కేవలం భద్రత ఏర్పాట్లు చేపట్టక పోవడమేనని ఈ విషయంలో టిటిడి పూర్తిగా విఫలమైంది అంటూ విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తిరుపతి ఘటన గురించి మాజీ టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తిరుపతి ఘటన ఘోరమని..చైర్మెన్ బీఆర్ నాయుడు మాటలు ఆందోళన కలిగించాయని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. తొక్కిసలాట ఘటన గురించి తెలిసాక దిగ్బ్రాంతికి గురయ్యానని.. గత ఐదేళ్ళలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి కార్యక్రమాలు ఎటువంటి ఒత్తిడి లేకుండా నిర్వహించామని అన్నారు.
కేవలం రెండు రోజులకు మాత్రమే పరిమితమైన వైకుంఠ ఏకాదశిని గత ప్రభుత్వ హయాంలో పీఠాధిపతులతో చర్చించి భక్తుల సౌకర్యం కోసం 10 రోజులకు పెంచమని అన్నారు. తమ ప్రభుత్వ హాయంలో ఎటువంటి అపశృతులు చోటు చేసుకోకుండా వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించామని గుర్తు చేసుకున్నారు అయితే ప్రస్తుతం మాత్రం వైకుంఠ ద్వార దర్శనంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం నిజంగా దురదృష్టకరమని అయితే దీనిపై దర్యాప్తు చేయించి బాధితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఈయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.