Tirupathi: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా 6 మంది మరణించారు. దాదాపు 40 మందికి పైగా గాయాలు పాలయ్యారు. ఇక వీరందరినీ కూడా తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు ఇక ఈ ఘటన జరిగిన తర్వాత అన్ని పార్టీ నేతలు తిరుపతికి చేరుకొని బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగిన వెంటనే హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు అనంతరం ఈమె నేడు తిరుపతికి చేరుకొని అక్కడ బాధితులను పరామర్శించారు.
పెద్ద ఎత్తున భక్తులు ఇలా తొక్కిసలాటలు గాయాలు పాలు కావడం బాధాకరమని అలాగే శ్రీవారి సేవలో పాల్గొనడం కోసం వచ్చిన భక్తులు మరణించడం బాధాకరమని అనిత తెలిపారు. బాధిత కుటుంబాలకు అలాగే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈమె భరోసా ఇచ్చారు. ఒక ప్రాణం కాపాడబోయి ఎక్కువ రద్దీ వల్ల ఆరుగురు మృతి చెందడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. సున్నితమైన ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయకుండా సహకరించాలని కోరారు.
ఇక చనిపోయిన వారిలో ఎక్కువ శాతం విశాఖకు చెందిన వారని అధికారులు గుర్తించారు. అనంతరం రుయా ఆస్పత్రికి వెళ్లి ఈమె చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు. ఇక ఈ ఘటనలో భాగంగా హోంమంత్రి మాట్లాడుతూ..తిరుపతి ఘటనలో కుట్ర కోణం ఉందా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తాం అన్నారు. బాధ్యతారహితంగా పని చేసినట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఎంతోమంది మంత్రులు తిరుపతికి చేరుకొని బాధితులను పరామర్శిస్తూ అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.