ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా పొత్తుధర్మం పాటించకుండా చంద్రబాబు ఏకపక్షంగా రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారంటూ జనసేన అధినేత పవన్.. నవ్వుతూ నవ్వుతూనే టీడీపీకి జలక్ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడం పొత్తు ధర్మం కాదని చెబుతూ.. బాబు వైఖరిని బహిరంగంగానే తప్పుపట్టారు. దీంతో టీడీపీ – జనసేన పొత్తు వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కింది!
ఇదే సమయంలో చంద్రబాబు పైన ఉన్నట్లే తనపైన కూడా ఒత్తిడి ఉందని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే తాను కూడా రెండు నియోజకవర్గాలను ప్రకటిస్తున్నానంటూ.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, రాజానగరం నియోజకవర్గాల పేర్లు ప్రకటించారు పవన్ కల్యాణ్. దీంతో పవన్ కావాలనే కయ్యానికి కాలు దువ్వుతున్నారంటూ తమ్ముళ్లు ఫైరవుతున్నారు.
అదేవిధంగా… వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన మూడొంతుల సీట్లలో పోటీ చేస్తుందని కూడా పవన్ ప్రకటించారు. అంటే… 58 – 60 సీట్లలో అన్నమాట! దీంతో జనసైనికులు హ్యాపీ ఫీలవ్వగా.. తమ్ముళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని తెలుస్తుంది. కారణం… జనసేనకు 60వరకూ టిక్కెట్లు ఇస్తే.. ఇక టీడీపీకి మిగిలేవి 115. కరెక్ట్ గా చెప్పాలంటే… 117! అంటే… 2014లో గెలిచిన స్థానాలన్ని అన్నమాట!
అంటే… ఒకవేళ పొత్తులో భాగంగా టీడీపీ – జనసేనలకు ప్రభుత్వాన్ని నెలకొల్పేటన్ని సీట్లు వస్తే… అందులో కచ్చితంగా జనసేన సహాయ సహకారాలతోనే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుందన్నమాట. దీంతో… గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిన పార్టీతో పొత్తు పెట్టుకుని.. ఈ స్థాయికి తెచ్చిపెట్టుకుని.. తమ పిలక తీసుకెళ్లి పవన్ చేతిలో పెట్టబోతున్నారన్నమాట చంద్రబాబు అంటూ తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.
పవన్ తాజాగా మాట్లాడిన మాటల అనంతరం టీడీపీ కార్యకర్తల్లోనూ, నేతల్లోనూ తెరపైకి వచ్చిన ఆందోళన ఇదని అంటున్నారు. ఆ సంగతి ఒకెత్తు అయితే… ప్రాక్టికల్ గా చూస్తే… జనసేన 58 స్థానాల్లో పోటీ చేస్తే, టీడీపీ నేతలు 58 మందిని బాబు బుజ్జగించాలి. అలాకానిపక్షంలో వారిలో సగం మంది రెబల్స్ గా మారినా… మొదటికే మోసం వస్తుంది. అప్పుడు రెంటికీ చెడ్డ రేవటిలా అయిపోతుంది పరిస్థితి!
దీంతో… చంద్రబాబుకు సరికొత్త రిక్వస్టులు పెడుతున్నారంట తమ్ముళ్లు. ఇందులో భాగంగా.. జనసేనతో పొత్తు విషయాన్ని మరొక్కసారి ఆలోచించాలని.. కోరి కొరివితో తలగోక్కోవద్దని.. జనసేన పొలిటికల్ ఫ్యూచర్ కి తమను పునాదులను చేయొద్దని మొత్తుకుంటున్నారని సమాచారం! మరి తాజాగా ఏర్పడినట్లు చెబుతున్న బీటలు.. గోడలు కూలేటంత పరిస్థితిని సృష్టిస్తాయా.. లేక, దాన్ని సిమ్మెంట్ పామి, మక్కు పెట్టి కవర్ చేసేస్తారా అన్నది వేచి చూడాలి.