సినిమా హీరోగా పవన్ ను అభిమానించేవారి సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదే సమయంలో జనసేన అధినేత అయిన తర్వాత ఆయనకు పొలొటికల్ గా కూడా ఫ్యాన్స్ పెరిగారు. వారందరినీ పవన్.. జనసైనికులు అని పిలుస్తుంటారు. అయితే… కాలక్రమంలో పవన్ తీసుకున్న నిర్ణయాలు ఆ జనసైనికుల్లో కొంతమందిని నిరాసకు గురిచేయగా.. మరికొంతమంది ఆశాజీవులను మాత్రం ఇంకా అలానే ఉంచింది.
కారణం… పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, కాపులకూ రాజ్యాధికారం వచ్చి తీరాలని ఆ సామాజికవర్గం బలంగా నమ్ముతుంది. ఈ సమయంలో పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబు వెనుక పరిగెత్తారు. దీంతో.. కొంతమంది అభిమానులు పెదవి విరిచారు.. పవన్ నిర్ణయాలను తప్పుబట్టారు. ఇప్పుడు కూడా 20 సీట్లకో పాతిక సీట్లకో జాతీ నమ్ముకున్న జాతిని అమ్ముకోవద్దని చెబుతున్నారు! ఆ సంగతి అలా ఉంటే… తాజాగా పవన్ పోస్ట్ చేసిన ఒక లేఖ వైరల్ గా మారింది.
తాజాగా ఐర్లాండ్ దేశంలో ఉన్న జనసేన అభిమాని ఒకరు తాజాగా పవన్ కల్యాణ్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో జనసేన పార్టీపై ఉన్న అభిమానాన్ని, రాజకీయంగా పవన్ పై ఉన్న నమ్మకాన్ని ఆ లేఖలో ప్రస్థావించారు. ఆ లేఖలో పేరు చెప్పకపోయినా.. తనను తాను “ఓడ కళాసీ”గా పరిచయం చేసుకున్న ఆ అభిమాని.. పవన్ కు లేఖ రాశారు. ఆ లేఖను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పవన్.. రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇష్యూ వైరల్ అవుతుంది. పవన్ కున్న బాధ్యతను గుర్తు చేసుంది.
ఈ లేఖలో తన అభిమానాన్ని, నమ్మకాన్ని వెల్లడించిన అభిమాని… అన్నా అంటూ మొదలుపెట్టి చెప్పాలనుకున్న విషయాన్ని అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా…
“కష్టాలు, కన్నీళ్లు, రుణాలు దారుణాలు… కారణాలుగా చూపిస్తూ నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కునే నాలాంటి వాళ్లెందరికో.. ఒక్కటే నీమీద ఆశ! ఎక్కడో బలీవియా అడవుల్లో అంతమై పోయిందని అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా? సరికొత్త గెరిల్లా వార్ ఫైర్ ని మొదలుపెట్టకపోతావా? మన దేశాన్ని.. కనీసం మన రాష్ట్రాన్నయినా.. మార్చకపోతావా?”
“17 ఏళ్లుగా ఈ దేశంలో లేకపోయినా.. ఈ దేశంపై ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక.. ఎదురుచూస్తున్న నాలాంటివాళ్లందరం, మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం. 2014 – నిలబడ్డాం.. 2019 – బలపడ్డాం.. 2024 – బలంగా కలబడదాం!” అని తన అభిప్రాయాన్ని అద్భుతంగా వివరించాడు ఆ అభిమాని. అనంతరం పవన్ కు జాగ్రత్తలు చెబుతూ… తన శక్తిని తనకు గుర్తుచేసే ప్రయత్నం చేశాడు.
ఇందులో భాగంగా… “కారుమీద ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్నా.. కారు కూతలు కూసేవారిని పట్టించుకోకన్నా. కారుమబ్బులు కమ్ముతున్నా… కార్యోన్ముఖుడివై వెళ్తున్న నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుందన్నా. పవర్ స్టార్ వి నువ్వే కదన్నా!! నువ్వు రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడివి” – – ఐర్లాండ్ నుంచి ఒక ఓడ కళాసి.. అని ముగించారు.
ఈ లేఖపై పవన్ స్పందించారు. ఇందులో భాగంగా… “ఐర్లాండ్ దేశంలో ఓడ కళాసీగా పనిచేస్తున్న నా జనసేన అభిమానీ.. నీ ఉత్తరం అందింది. చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడిపోయింది. కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేశావు” పేర్కొన్నారు.
దీంతో… ఈ స్థాయిలో అభిమానం చూపిస్తున్న అభిమానులను, వారి అభిమానాన్ని, వారి నమ్మకాన్ని కాపు కాయాల్సిన బృహత్తర బాధ్యత పవన్ పై ఏ స్థాయిలో ఉందో ఈ లేఖ చెబుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఆ నమ్మకాన్ని నిలుపుకుంటారా.. అమ్ముకుంటారా.. తాకట్టుపెట్టుకుంటారా.. వమ్ము చేసుకుంటారా అనంది పవన్ చేతుల్లో ఉంది!!
ఐర్లాండ్ దేశం లో ‘ఓడ కళాసీకి’ గా పనిచేస్తున్నా నా ప్రియమైన జనసైనికుడికి, నీ ఉత్తరం అందింది, చదివిన వెంటనే,
గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.. కన్నీరు తెప్పించావు..
కార్యోన్ముఖుడిని చేసావు.. 🙏 pic.twitter.com/XhbSYQ1Y6D— Pawan Kalyan (@PawanKalyan) January 17, 2024