నిజంగానే నందమూరి సోదరులు తప్పు చేశారా.. అవునంటున్న తెదేపా వర్గం!

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నారా రామ్మూర్తి నాయుడు శనివారం గుండెపోటుతో తుది శ్వాస విడిచిన సంగతి అందరికీ తెలిసిందే. నవంబర్ 16 మధ్యాహ్నం 12:45 కి ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లవలసిన నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు పరిస్థితి తెలిసి అర్ధాంతరంగా పర్యటనని రద్దు చేసుకొని హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి వెళ్లారు. తన తమ్ముడి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని ఆయన వెల్లడించారు. తమ నుంచి దూరమై కుటుంబంలో విషాదం నింపాడని పేర్కొన్నారు. తమ్ముడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అయిన తిరుపతి జిల్లా నారావారిపల్లెలో ప్రభుత్వ అధికార లాంచనాలతో నిర్వహించారు.

ఇంటి వద్ద నుంచి అంతిమ యాత్రని ప్రారంభించి గ్రామ సమీపంలోని చంద్రబాబు నాయుడు, రామ్మూర్తి నాయుడుల తల్లిదండ్రుల సమాధుల సమీపంలోని మామిడి తోటలో ఏర్పాటు చేసిన ప్రాంతానికి తీసుకువచ్చి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. నారా రోహిత్ తండ్రికి అంతిమ సంస్కారాన్ని నిర్వహించారు. తర్వాత అక్కడే కుటుంబ సభ్యులు పాలాభిషేకం చేశారు. రామ్మూర్తి నాయుడు మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు, తెదేపా శ్రేణులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అంత్యక్రియలలో పాల్గొనటమే కాకుండా తమ సానుభూతిని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

అయితే చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన అన్న అయిన కళ్యాణ్ రామ్ కానీ అంత్యక్రియలకు హాజరు కాలేదు సరి కదా తమ సంతాపాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేయలేదు.అంత్యక్రియలకు హాజరు కాలేదంటే అర్థం ఉంది, ఎందుకంటే ఆ సమయానికి వారు హాజరు అయ్యే పరిస్థితులలో ఉండి ఉండకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో సంతాపం తెలిపి ఉంటే బాగుండేది అంటూ నందమూరి సోదరులని తప్పుపడుతున్నారు తెలుగుదేశం వర్గం వారు. మరి దీనిపై నందమూరి సోదరులు ఎలాంటి వివరణ ఇస్తారో వేసి చూడాలి.