Mangalagiri: మంగళగిరిలో హల్చల్ చేసిన లేడీ అఘోరీ.. పవన్ కళ్యాణ్ కలిసే వెళ్తానంటూ?

Mangalagiri: లేడీ అఘోరీ గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో హల్చల్ చేస్తున్నారు. తెలంగాణలో ఎప్పుడైతే ముత్యాలమ్మ ఆలయం పై దాడి జరిగిందో ఆ క్షణం ఈమె హైదరాబాదులోకి అడుగు పెట్టారు. ఇలా హైదరాబాదులో పలు ఆలయాలను సందర్శిస్తున్నటువంటి ఈమె ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండించి సనాతన ధర్మాన్ని కాపాడాలని తెలిపారు. ధర్మాన్ని కాపాడటం కోసం తాను ఎంతటికైనా పోరాటం చేస్తానని తెలిపారు.

ఇలా తెలంగాణలో పలు ప్రాంతాలలో పర్యటించిన ఈమె అనంతరం ఆంధ్రాలోకి అడుగు పెట్టారు. ఇలా ఆంధ్రాలో శ్రీకాళహస్తి యాగంటి మహానంది వంటి ఆలయాలను సందర్శించిన అఘోరీ తిరిగి హైదరాబాద్ వెళ్లారు. తాజాగా మరోసారి ఈమె ఆంధ్రాలోకి అడుగు పెట్టారు.విజయవాడ వెళ్లే రహదారిపై మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవేపై ఈమె హల్చల్ చేశారు. ఇక ఈమెను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులపై కూడా దాడికి ప్రయత్నించారు.

తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి వెళ్తానని ఆయనని కలవనిదే తాను ఇక్కడి నుంచి వెళ్ళనని ఈమె తెలిపారు. ఆలయ భూములను పరిరక్షించే విషయంలో తాను పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలని తెలిపారు..పవన్ కళ్యాణ్ రావాలి… అంటూ నినాదాలు చేసింది. అఘోరీ నిరసనతో గుంటూరు విజయవాడ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి ఓ రిపోర్టర్ వీడియో తీస్తుండగా ఆమె అతనిపై కర్రతో దాడి చేస్తుంది దీంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులపై కూడా ఈమె దాడి చేశారు.

అఘోరీ తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించడం వల్ల ఎంతో మందికి ఇబ్బంది అవుతోందని, ఈమె కారణంగా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడంతో పలువురు మండిపడుతున్నారు. ఒకవేళ ధర్నా చేయాలి అనుకుంటే జనసేన ఆఫీసు ముందు ధర్నా చేయాలి కానీ ఇలా నడిరోడ్డులో కూర్చుని ఇబ్బంది కలిగించడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈమె ఏదో ఒక విషయం వల్ల వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే.