తాజాగా భీమవరంలో జరిగిన జనసేన బహిరంగ సభలో మైకందుకున్న పవన్… ఇతర స్టార్ హీరోల అభిమానులతో గొడవలు పెట్టుకోవద్దని వేడుకున్నారు. మన సినిమా పోస్టర్స్ ఎవరైనా చించినా క్షమించేయమని కోరారు. పరోక్షంగా మీరు కూడా ఇతర హీరోల పోస్టర్లూ చింపే చిల్లర పనులకు తెగబడొద్దని సూచించారు! అయితే పవన్… పోస్టర్స్ చించొద్దని చెప్పాడే కానీ సినిమా తెర చింపొద్దని చెప్పలేదుగా అనుకున్నారో ఏమో కానీ థియేటర్ లో తెర చించి రచ్చ రచ్చ చేశారు పవన్ ఫ్యాన్స్!
అవును… విజయవాడలోని ఒక థియేటర్ లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు! థియేటర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు! తెరని చించేశారు.. థియేటర్ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు! పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “తొలిప్రేమ” సినిమా ప్రదర్శిస్తున్న విజయవాడ నగరం గాంధీ నగర్ లో ఉన్న కపర్థి థియేటర్ ని పవన్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు! దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో… క్రమశిక్షణ కలిగిన పార్టీ, అంతకు మించి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అనే పదాలకు ఏమాత్రం అవకాశం లేకుండా చేయాలనా.. లేక, జనసేన ఎన్నికల్లో గెలిస్తే ఏపీ ఫ్యూచర్ ఇలానే ఉంటుందని ప్రజలకు చెప్పాలనా ఇలాంటి పనులకు పూనుకోవడం.. అంటూ కామెంట్ చేస్తున్నారు జనసేన అభిమానులు. ఇదే సమయంలో పవన్ మత్తులోనే ఉన్నారా.. లేక, మరో మత్తులో ఉన్నారా అంటూ సీరియస్ జనసేన ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
ఇవి కూడా పవన్ ఫ్యాన్స్ పై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిస్తుంది అని ఆరోపిస్తారేమో అని వైసీపీ కార్యకర్తలు కామెంట్ చ్ అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి!
సెకండ్ షో ప్రారంభమైన కొద్దిసేపటికి కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్లో టపాసులు పేలుస్తూ స్క్రీన్ వద్దకు చేరి డ్యాన్సులు చేశారు! ఆ సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్ స్క్రీన్ ను చించివేసే ప్రయత్నం చేశారు! ఇది గమనించిన థియేటర్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు! దీంతో రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ అభిమానులకు, థియేటర్ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది!
ఇలా రెచ్చిపోయి అల్లరి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని థియేటర్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా… వారిపై ఫ్యాన్స్ దాడి చేసినట్లు థియేటర్ నిర్వాహకులు ఆరోపించారు. అంతేకాక స్క్రీన్ ను చించివేశారని, కుర్చీలు, తలుపులను విరగ్గొట్టడంతోపాటు థియేటర్ అద్దాలను పగులగొట్టినట్లు పోలీసులకు చెప్పారు. ఫలితంగా థియేటర్ లో విధ్వంసం సృష్టించి రూ.4 లక్షల ఆస్తి నష్టం కలిగించినట్లు థియేటర్ మేనేజర్ మోహనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో… “నువ్వు.. నువ్వు మారవా”… అంటూ “మిర్చి” సినిమాలో విలన్ తో ప్రభాస్ చెప్పే డైలాగుని కలిపి ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు!