సంధ్య థియేటర్ ఘటన తర్వాత చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను ఏ11గా చేర్చుతూ కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు నాలుగువారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. అయితే హైకోర్టులో తదుపరి విచారణ తర్వాత ఈ మధ్యంతర బెయిల్ కు పొడిగింపు లభించే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ పోలీసులు బెయిల్ ను గట్టిగా వ్యతిరేకించి పొడిగింపు లభించకపోతే మాత్రం అల్లు అర్జున్ కు ఇబ్బందులు తప్పవు. అందుకే ట్రయల్ కోర్టు అయిన నాంపల్లి కోర్టులో ఆయన రెగ్యులర్ బెయిల్ కోరారు.దీనిపై ఇప్పటికే నాంపల్లి కోర్టు వాదనలు పూర్తి చేసింది. పోలీసులు కూడా అల్లు అర్జున్ బెయిల్ పై అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఇందులో అల్లు అర్జున్ బెయిల్ ను పోలీసులు వ్యతిరేకించలేదు.
కానీ ఒకవేళ బెయిల్ ఇస్తే మాత్రం విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరారు. దీంతో అల్లు అర్జున్ బెయిల్ పై వాదనలు పూర్తి చేసిన నాంపల్లి కోర్టు తీర్పును ఇవాళ్టికి రిజర్వ్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో నిర్మాతలు నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ లకి ఊరట లభించింది. వారిని విచారించవచ్చు కానీ అరెస్టు చేయవద్దు అంటూ పోలీసులని ఆదేశించింది. న్యాయవాదుల వాదనను ఎప్పటికీ కోర్టు పరిశీలించింది నేటికీ తీర్పుని వాయిదా వేసింది అయితే అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికీ, తెలుగు సినీ పరిశ్రమ కి మధ్య దూరం పెరిగినా ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో సీఎం రేవంత్ రెడ్డి, సినీ ఇండస్ట్రీ పెద్దలు కలిసి కూర్చుని చర్చించుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం కాస్త చల్లబడినట్లు కనిపిస్తోంది. అందుకే గతంలో నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ వ్యతిరేకించిన పోలీసులు కాస్త బెట్టు తగ్గించి బెయిల్ ఇచ్చినా విచారణకు సహకరించేలా చూడమని మాత్రమే కోరారు. ఇక అల్లుఅర్జున్ కి బెయిల్ వస్తుందా లేదా అనేది తెలియాలంటే కోర్టు తీర్పు ఇచ్చేవరకు ఆగాల్సిందే.