Anchor Udaya Bhanu: మరోసారి వెండితెరపై సీనియర్ యాంకర్ ఉదయభాను?

తెలుగు బుల్లితెరపై ఒకప్పుడు టాప్ యాంకర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఉదయభాను ప్రస్తుతం వెండితెరపై పునరాగమనం చేసేందుకు సిద్ధమైంది. ఆర్. నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ఎర్ర సైన్యం సినిమాతో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించిన ఉదయభాను, అనంతరం పలు భాషలలో నటించింది. హిందీలో పౌరాణిక సీరియల్స్, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ, వాటి ద్వారా ఆశించిన గుర్తింపును పొందలేకపోయింది.

బుల్లితెరపై యాంకరింగ్‌కి మంచి పాపులారిటీ వచ్చినా, ఆమె నటిగా విజయాన్ని అందుకోవాలని ప్రయత్నాలు చేసింది. లీడర్, జులాయి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, అలాగే 2013లో మధుమతి చిత్రంలో లీడ్ రోల్ చేసింది. కానీ ఆశించిన విధంగా ఈ ప్రాజెక్టులు విజయవంతం కాలేదు. దాంతో బుల్లితెర యాంకరింగ్‌కి కొంతకాలం దూరంగా ఉండి, 2024లో నారా రోహిత్ ప్రతినిధి 2 చిత్రంతో మళ్లీ తెరపై కనిపించింది.

ఇప్పుడు, సత్యరాజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న బార్బరిక్ అనే సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా ఆమె నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో, భారీ ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోందని టాక్. తమిళంలో విజయ్ సేతుపతి మహారాజ తరహాలో ఈ కథనం ఉండబోతుందట. ఉదయభాను విలన్ పాత్రలో ఆమె నటనా నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించబోతోందని సమాచారం. ఈ చిత్రం ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా మారొచ్చని భావిస్తున్నారు. మరలా వెండితెరపై విజయాన్ని అందుకుంటే, దర్శకులు ప్రత్యేకంగా ఆమె కోసం పాత్రలు సృష్టించే అవకాశం ఉంది.