Revanth Reddy: వాళ్ళకు 12 వేల ఆర్థికసాయం.. రేవంత్ సర్కారుకు క్లిష్టమైన ఛాలెంజ్?

తెలంగాణ ప్రభుత్వం రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించాలనే తన ఎన్నికల హామీని అమలు చేయటానికి కసరత్తు చేస్తోంది. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12,000 ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంక్రాంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, లబ్ధిదారులను గుర్తించడం, నిధుల సేకరణ వంటి అంశాలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేశాయి.

రాష్ట్రవ్యాప్తంగా కోటి 16 లక్షల కుటుంబాల్లో 46 లక్షల కుటుంబాలకు భూమి లేని కూలీలుగా గుర్తింపు ఉందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, వీరిలో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న 23 లక్షల మందిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది మిగతా రైతు కూలీలలో వ్యతిరేకతకు దారి తీస్తుందేమోనని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉపాధి హామీ పనులకు వెళ్లే వారి గుర్తింపు ఆధారంగా మాత్రమే సాయం ఇవ్వాలని భావించినప్పటికీ, ఈ నిర్ణయం రైతు కూలీల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పథకం అమలుకు అవసరమైన నిధుల అంశం మరో పెద్ద సమస్యగా మారింది. 46 లక్షల మందికి సాయం అందించాలంటే రూ. 5,200 కోట్ల వరకు నిధులు కావాల్సి ఉంటుంది. కానీ, ఈ మొత్తాన్ని ప్రభుత్వం సమకూర్చడం కష్టసాధ్యంగా మారడంతో మొదటిదశలోనే 23 లక్షల మందికి మాత్రమే సాయం చేయాలని యోచిస్తోంది. మొదటి విడతలో 6,000 రూపాయల చొప్పున చెల్లించాలంటే సుమారు రూ. 1,350 కోట్ల నిధులు అవసరం అవుతాయి.

రైతు కూలీల సాయానికి గైడ్‌లైన్స్ విడుదల చేసే ముందు ప్రభుత్వం వ్యతిరేకతను తట్టుకోవడానికి వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే రైతు రుణమాఫీ అమలులో ఆలస్యాలు ప్రతిపక్షాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో రైతు భరోసా అమలు, రైతు కూలీల సాయంపై సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.