తన సినిమా స్టోరీలు తానొక్కడూ విని తానొక్కడూ ఓకే చేస్తే చాలు, తన రెమ్యునరేషన్ తాను మాట్లాడుకుంటే చాలు, లేదా తన తరుపున తన మేనేజర్ మాట్లాడితే చాలు… మిగిలిన వ్యవహారం అంతా నిర్మాత, దర్శకుడు చూసుకుంటారు.. అది సినిమా.! అయితే ఇది రాజకీయం.. ప్రజల జీవితాలను మార్చుతామని పెట్టుకున్న రాజకీయ పార్టీ! ఇక్క్డ ఒటెద్దు పోకడలకు పోతే ఎలా?
ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు జనసేనలో ఎదురవుతున్న ప్రశ్నలు ఇవి. పొద్దున్న లేస్తే ఆత్మాభిమానం అనే పవన్ కల్యాణ్… తనకు తప్ప తన పార్టీలోని మిగిలిన నేతలకు అది లేదను కుంటారా.. లేక, వారికి ఉండవని భావిస్తారా అనేది ఇప్పుడు జనసేనలో బలంగా వినిపిస్తున్న ప్రశ్న.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాకత్ అయిన పవన్ కల్యాణ్… బయటకు రాగానే పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పూర్తిగా పవన్, ఆయన మేనేజర్ లాంటి నాదెండ్ల మనోహర్ మధ్య జరిగిన డిస్కషనే తప్ప… మరో నేతకు తెలియదనే మాటలు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలోనే… నాలుగో విడత వారాహి యాత్రకు జనాల్లో స్పందన కరువయ్యిందని, జనాలు తగ్గారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది. అంటే… టీడీపీ – జనసేన పొత్తును మెజారిటీ తమ్ముళ్లు ఆహ్వానించడం లేదని, ఆత్మాభిమానం ఉన్న జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. నాలుగో విడత వారాహికి స్పందన కరువవ్వడానికి ఇదే కారణం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో… ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కు షాక్ ఇచ్చారు జనసేన సీనియర్ నేత.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై పవన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వారాహి యాత్రను ప్రారంభించారు. ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో పర్యటించారు. అలా ఎన్నో ఆశలు పెట్టుకున్న తూర్పుగోదావరి జిల్లాల్లో పవన్ కు షాక్ తగిలింది. గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్ చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్ సహా 100 మంది నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా… ఆత్మగౌరవం, ఆత్మాభిమానం గురించి మాట్లాడే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తన పార్టీలో ఉన్న వారికి కూడా అవి ఉంటాయన్న విషయం తెలుకోలేకపోవడం బాధాకరమని చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో ప్రజారాజ్యం, జనసేన పార్టీలో కలిపి సుమారు 16 ఏళ్లు అంకితభావంతో పనిచేశానని.. అయితే, పార్టీలో ఒంటెద్దు పోకడలు పెరిగిపోయాయని, అంతర్గత ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని, ఆ కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు.
ఇదే సమయంలో గతంలో ఎన్నో ఆశలతో, ఎంతో నమ్మకంతో పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు జనసేనలో చేరినప్పటికీ… అతి స్వల్ప కాలంలోనే పార్టీని వీడారు అనే విషయాలను గుర్తుచేసిన గురుదత్త ప్రసాద్… అందులో భాగంగా… సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతోపాటు రాజు రవితేజ, అద్దేపల్లి శ్రీధర్, తోట చంద్రశేఖర్, జయలలిత వద్ద సీఎస్ గా పనిచేసిన రామ్మోహన్ సహా 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జనసేనకు గుడ్ బై చెప్పారని అన్నారు.
ఈ సందర్భంగా తన రాజీనామాకు పార్టీ అధ్యక్షుడి తీరే కారణం అని సూటిగా సుత్తిలేకుండా చెబుతున్న గురుదత్త ప్రసాద్… త్వరలో మరికొంతమంది నేతలు జనసేనకు రాజీనామా చేస్తారని తెలిపారు. అయితే… టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత హార్డ్ కోర్ జనసేన రాజకీయ నాయకులు హర్ట్ అయ్యారని, తన స్వార్థంకోసం జనసేన నాయకుల అభిప్రాయాలను కనీసం వినడం కూడా చేయలేదని తెలిపారు.