ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ యాత్రను ప్రారంభిస్తున్నారు.! మొన్నామధ్య విజయవాడలో వారాహి హడావిడి చేసింది కదా.? అంటే, అది వేరే వ్యవహారం. ఈసారి లెక్కలు వేరేలా వుంటాయట.!
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం నుంచి ‘వారాహి’ యాత్రను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన ప్రారంభిస్తారన్నది జనసేన కీలక నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన.
ఈలోగా పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల తాలూకు వ్యవహారాలు పూర్తయిపోతాయట. ఆ తర్వాత నేరుగా రాజకీయ రణ రంగంలోకి దూకేస్తారట. పూర్తిగా జనంలోనే జనసేనాని వుండబోతున్నారా.? అంతేనా.! ప్చ్.. ఇక్కడా కొన్ని డౌట్లు వున్నాయ్.
ఒక్కో నియోజకవర్గానికీ జనసేనాని రెండు రోజుల సమయం కేటాయించబోతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. తొలుత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో, ఆ తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనాని యాత్ర వుండబోతోందిట.
జిల్లా జిల్లాకీ విరామం తీసుకుని, బహుశా చేయాల్సిన సినిమాల షూటింగుల్ని సైమల్టేసినయస్గా చేసేస్తుంటారేమో.! అలాగే అనుకోవాలి. ఎలాగైతేనేం, జనంలోకి జనసేనాని వస్తున్నారు.. జనసేన శ్రేణులకు కావాల్సిందేముంది.?
వారాహి వాహనం ఎప్పుడో సిద్ధమయ్యింది.. కానీ, దాన్ని సరిగ్గా వినియోగించడానికే ఇప్పటిదాకా సరైన ముహూర్తం కుదరలేదు.