ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార బీఆరెస్స్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. ఇదే సమయంలో మ్యానిఫెస్టోపై కూడా ఒక క్లారిటీకి వచ్చేసిందని చెబుతున్నారు. ఇదే సమయలో సుమారు 70 మంది అభ్యర్థులు ఫైనల్ అయ్యారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక బీజేపీ కూడా అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ కోసం కుస్తీపడుతుందని అంటున్నారు.
తెలంగాణలో ప్రధాన పార్టీల పరిస్థితి అలా ఉంటే… ఏపీలో పొత్తులో ఉన్నట్లు ప్రకటించిన టీడీపీ – జనసేనలు మాత్రం తెలంగాణలో విడివిడిగానే పోటీచేస్తాయని అంటున్నారు. ఎందుకలా అంటే… తెలంగాణలో పవన్ “లెక్క” వేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఎన్డీయే లో ఉన్నామని చెప్పుకుంటున్నారు కాబట్టి.. బీజేపీతో కలిసి పోటీ చేస్తారా అంటే… మళ్లీ అదే సమాధానం… తెలంగాణలో పవన్ “లెక్క” వేరు అని!
ఈ నెల 20 నుంచి అయిదు రోజుల పాటు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పవన్ పాల్గొంటారని.. ఆ తరువాత తెలంగాణలో “ఎంపిక చేసిన” కొన్ని స్థానాల్లో ప్రచారం చేస్తారని అంటున్నారు. వాస్తవానికి తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలంగాణ జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అన్ని స్థానాల్లోనూ పవన్ ప్రచారం ఉండదని చెబుతున్నారు.
దీంతో… పవన్ ప్రచారం అంతా బీఆరెస్స్ బలహీనంగా, కాంగ్రెస్ – బీజేపీలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే ఉంటుందనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఊపందుకుంది. అలా ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో బీఆరెస్స్ కు వ్యతిరేకంగా పవన్ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తారని చెబుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుతారని అంటున్నారు.
ఇలా చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, పరోక్షంగా అధికార బీఆరెస్స్ కు లాభం చేకూరుతుందని చెబుతున్నారు. ఇది తెలంగాణలో కేటీఆర్, పవన్ కల్యాణ్ కి ఇచ్చిన టాస్క్ అని ఒక వార్త తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతుంది. అవిభక్త కవలలుగా ఉండే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పవన్ ఏపీలో అలా, తెలంగాణలో ఇలా వ్యవహరించడం వెనక ఆయన “లెక్క” ఆయనకుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీంతో… జనం ఏమనుకుంటారనే కనీస ఆలోచన లేకుండా పవన్ చేస్తున్న రాజకీయాలు నభూతో నభవిష్యతీ అని అంటున్నారు పరిశీలకులు. ఫలితంగా… తెలంగాణలో జనసేన విజయం కోసం కాకుండా, కాంగ్రెస్ ఓటమి కోసం పని చేస్తున్నారు… ఏపీలో కూడా జనసేన కోసం కాకుండా టీడీపీని బలపరచడం కోసం పరితపిస్తున్నారు వంటి విమర్శలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరి ఈ విషయంపై జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది వేచి చూడాలి. ఎన్డీయే కూటమిలో ఉన్న బీజేపీతోనూ కాకుండా, ఏపీలో పొత్తులో ఉన్న టీడీపీతోనూ కాకుండా… ఒంటరిగా పోటీ చేయడంపై ఇలాంటి అనుమానాలే వస్తాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!