Pushpa 2: పుష్ప 2: రన్ టైమ్ మళ్ళీ పెరగనుందా?

పుష్ప 2: ది రూల్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మోగిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేస్తోంది. భారీ కలెక్షన్లతో సినీ పరిశ్రమలో కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. నార్త్ ఇండియాలో ప్రత్యేకించి పుష్ప మేనియా అసాధారణ స్థాయిలో కొనసాగుతోంది.

ఇప్పటికే బాలీవుడ్ మార్కెట్‌లో రూ.710 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పుష్ప 2, త్వరలోనే రూ.800 కోట్లను దాటే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 21 రోజుల్లో రూ.1600 కోట్లను దాటేసిన ఈ చిత్రం, ఇప్పటికీ కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. ముఖ్యంగా క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ పండగ సీజన్‌కు మరింత కలెక్షన్లు సాధించనుంది.

ఇదే సమయంలో, పుష్ప 2 మేకర్స్ తమ తర్వాతి కార్యాచరణపై దృష్టి సారించారు. కొత్త ఫుటేజ్ జోడించడం ద్వారా సినిమా థియేటర్ల రన్‌ను పొడిగించాలనే ప్రయత్నంలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సుమారు 20 నిమిషాల కొత్త సన్నివేశాలను చిత్రంలో జోడించేందుకు టీమ్ ఇప్పటికే సిద్ధమవుతోందట. త్వరలో ఈ కొత్త వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేయనున్నారు.

మూడు గంటల 20 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ, పుష్ప 2 ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు కొత్త సీన్స్ యాడ్ చేయడం ద్వారా థియేటర్లకు ప్రేక్షకులు తిరిగి వస్తారని, తద్వారా కలెక్షన్లు మరింత పెరుగుతాయని మేకర్స్ ఆశిస్తున్నారు. పైగా, ఓటీటీ విడుదలకు సమయం ఉండటం కూడా ఈ ప్రయత్నానికి అనుకూలంగా మారనుంది. కొత్త వెర్షన్ ప్రేక్షకుల నుండి ఎంత ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.