Jani Master: నేను నిర్దోషిగానే బయటకు వస్తాను… నాకు తెలిసిన విద్య అది మాత్రమే: జానీ మాస్టర్

Jani Master: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్నారు. ఈయన తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమెను పలుమార్లు అత్యాచారం చేశారు అంటూ సదరు బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు తన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసినదే.

ఈ విధంగా జానీ మాస్టర్ అరెస్టు కావడంతో ఈ విషయం కాస్త సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారడమే కాకుండా ఈయనకు వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇక కొన్ని రోజులపాటు జైలులో ఉన్నటువంటి జానీ మాస్టర్ అనంతరం బెయిలు మీద బయటకు వచ్చారు.. ఇలా బెయిల్ మీద బయటకు వచ్చిన ఈయన తిరిగి తన వృత్తిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.

ఇలాంటి తరుణంలోనే జానీ మాస్టర్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. జానీ మాస్టర్‌పై పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు. నా గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని తెలిపారు. న్యాయస్థానంపై నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో న్యాయం ఉంది కాబట్టే ఈరోజు ఇలా నేను బయటకు వచ్చి నా పని నేను చేసుకుంటున్నానని పేర్కొన్నారు. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని.. ఆ దేవుడికి తెలుసు నా విషయంలో న్యాయస్థానం సరైన తీర్పును ఇస్తుంది.

ఏదో ఒక రోజు నేను నిర్దోషి అని తెలుస్తుందని నిర్దోషిగానే నేను అందరి ముందుకు వచ్చి అప్పుడు ప్రతి ఒక్కరి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని తెలిపారు. ఇక నాకు ఇండస్ట్రీలో తెలిసిన విద్య డాన్స్ మాత్రమేనని ఈయన తెలిపారు. డాన్స్‌తో మిమల్ని ఎంటర్‌టైన్ చేయడం. మీ అందరి దీవెనల వల్లనే నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను.. మీ అందరిని అలరించడానికి కష్టపడతాను.. మీ ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ జానీ మాస్టర్ చేసిన ఈ వాక్యాలు సంచలనంగా మారాయి.