మనమంతా కలసి పనిచేద్దాం రండి.. సినీ ప్రముఖులతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

కలసి పనిచేద్దాం రండి..తెలంగాణ అభివృద్దిలో విూరూ భాగస్వాములు కండి అని సిఎం రేవంత్‌ రెడ్డి చిత్రపరిశ్రమను ఆహ్వానించారు. సినీ పరిశ్రమలో సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆయన సూచనలు చేశారు. సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై అధ్యయనం చేయనుంది.

రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, అదనపు షోల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు, టికెట్‌ రేట్ల పెంపుపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది. సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించిన నేపథ్యంలో ఇండస్ట్రీ ప్రముఖులు తమ సూచనలను ఉప సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. సినిమా పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. గురువారం బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖులు సిఎం రేవంత్‌ ను కలిశారు.

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై నివేదిక రూపొందించి సర్కార్‌ అందజేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలని చెప్పారు. డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలని, టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్‌ చేయాలని సిఎం సూచించారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని రేవంత్‌రెడ్డి అన్నారు.

ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు. సినీ ప్రముఖులతో సీఎం భేటీ గురువారం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని ముఖ్యమంత్రి సినీ పెద్దలకు సూచించారు. బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీజీపీ జితేందర్‌ తదితరులు హాజరయ్యారు. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్‌ అరెస్ట్‌ అనంతర పరిణామాల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడిరది. సమావేశం ప్రారంభంలో సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖుల ఎదుట సీఎం ప్రదర్శించారు.

అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ప్రభుత్వం వైఖరిని సీఎం వారికి వివరించారు. ‘ప్రభుత్వం ఇండస్ట్రీ తోనే ఉంది. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపాలి. ఆలయ పర్యటకం, ఎకోటూరిజంను ప్రచారం చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్‌గా ఉంటాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ తేల్చి చెప్పారు.

సినీ పరిశ్రమ సమస్యలను ప్రముఖులు మా దృష్టికి తెచ్చారు. అనుమానాలు, అపోహలు, ఆలోచనలు పంచుకున్నారు. మా ప్రభుత్వం ఇండస్ట్రీకి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే మా ముఖ్య ఉద్దేశం. 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్‌ జీవోలు ఇచ్చింది. పుష్ప సినిమాకు పోలీసు గ్రౌండ్‌ ఇచ్చాం. తెలుగు ఇండస్ట్రీకి ఒక బ్రాండ్‌ సృష్టించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఐటీ, ఫార్మాతో పాటు మాకు ఈ రంగం కూడా ముఖ్యమే. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్‌ అవార్డును తీసుకొచ్చాం. ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండాలని దిల్‌ రాజును ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించాం.

సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. హాలీవుడ్‌, బాలీవుడ్‌ హైదరాబాద్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. నగరంలో పెద్ద సదస్సులు నిర్వహించి ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తున్నాం. అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నాం.

ఇండస్ట్రీకి ఏం చేసినా కాంగ్రెస్‌ ప్రభుత్వాలే చేశాయి. ఆ వారసత్వాన్ని మేమూ కొనసాగిస్తాం. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దాం’ అని సీఎం వివరించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ సహకారం ఉంటుందని.. ఆ మేరకు సినీ ప్రముఖులకు భరోసా ఇచ్చినట్లు ఆ తర్వాత ముఖ్యమంత్రి ’ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం మూలధన పెట్టుబడులు కల్పిస్తేనే మన సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్‌ ప్రపంచ సినిమా రాజధాని కావాలనేదే మా కోరిక. యూనివర్సల్‌ లెవల్‌లో స్టూడియో సెటప్‌లు ఉండాలి’ అని తెలిపారు.

మర్రి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చిందని దర్శకుడు త్రివిక్రమ్‌ చెప్పారు. ‘తెలంగాణలో అద్భుతమైన పర్యటన ప్రదేశాలున్నాయి. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందరు సీఎంలూ పరిశ్రమను బాగానే చూసుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా మాకు ప్రోత్సాహం అందిస్తోంది. దిల్‌రాజును ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించడం హర్షణీయం అని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు.

‘నేను చిన్నప్పటి నుంచి పరిశ్రమను చూస్తున్నా. హైదరాబాద్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి అన్నారు. సంధ్య థియేటర్‌ ఘటన మమల్నీ ఎంతగానో బాధించింది. ఎన్నికల ఫలితాల మాదిరిగానే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుంది. సినిమా రిలీజ్‌లో పోటీ వల్లే ప్రమోషన్‌ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమాలు విడుదలవుతున్నందున విస్తృతంగా ప్రమోషన్లు చేస్తున్నాం అని మురళీ మోహన్‌ అన్నారు.

ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వం సాయంతోనే ఆ రోజుల్లో సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. నెట్‌ప్లిక్స్‌, అమెజాన్‌ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండాలి. నగరాన్ని ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌గా చేయాలనేది మా కల అని నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ బాబు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశం అనంతరం ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు విూడియాతో మాట్లాడారు. సీఎంతో చర్చించిన విషయాల గురించి తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధే ఈ విూటింగ్‌ ముఖ్య ఉద్దేశం అని అన్నారు.

తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి తమకు కొన్ని విషయాల్లో దిశా నిర్దేశర చేశారని చెప్పారు. ఇటీవలి కాలంలో పరిశ్రమ, ప్రభుత్వం మధ్య దూరం ఏర్పడిందనే ప్రచారం జరిగిందని, అదంతా కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. త్వరలోనే మరోసారి ముఖ్యమంత్రితో భేటీ అవుతామని చెప్పారు.

తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకు ఉన్న విజన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాతో పంచుకున్నారు. తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయాలనే దానిపై ఆయన చర్చించారు. అందుకు అనుగుణంగా మేమంతా కలిసి వర్క్‌ చేస్తాం. ఇండియన్‌ సినిమా వాళ్లే కాకుండా హాలీవుడ్‌ వాళ్లు కూడా హైదరాబాద్‌లో షూటింగ్స్‌ చేసుకునేలా ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చించారు. దానిపై చిత్రపరిశ్రమ మొత్తం మరోసారి చర్చించుకుని ఎఫ్‌డీసీ ద్వారా ఆయనకు సలహాలు, సూచనలు ఇస్తాం. హైదరాబాద్‌ను సినిమా ఇండస్ట్రీకి ఇంటర్నేషనల్‌ హబ్‌గా మార్చేందుకు అడుగులు వేస్తాం. డ్రగ్స్‌ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తాం.

ఈ మధ్య జరిగిన కొన్ని అనివార్య సంఘటనల వల్ల పరిశ్రమ, ప్రభుత్వం మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. అది అపోహ మాత్రమే. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నేను బాధ్యతలు తీసుకుని వారం రోజులు అయింది. యూఎస్‌ వెళ్లి రాగానే ముఖ్యమంత్రిని కలిశాను. ఇండస్ట్రీ అభివృద్ధి మాత్రమే ఇక్కడ విషయం. బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్లు అనేది చిన్న విషయం. అది ముఖ్యం కాదు. ఇంటర్నేషనల్‌గా తెలుగు చిత్రపరిశ్రమను అభివృద్ధి చేయడం అనేది అజెండా‘ అని దిల్‌ రాజు తెలిపారు.